Begin typing your search above and press return to search.

ఆదివారాలు చిరు ఏం చేస్తారో.. ఆశ్చ‌ర్యంలో న‌టి!

తాజా ఇంట‌ర్వ్యూలో `విశ్వంభ‌ర` క‌థానాయిక ఆషికా రంగ‌నాథ్ మాట్లాడుతూ..అభిమానుల‌తో చిరంజీవి ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ఆయ‌న‌ ధృక్ప‌థం గురించి మాట్లాడారు.

By:  Sivaji Kontham   |   15 Nov 2025 9:50 AM IST
ఆదివారాలు చిరు ఏం చేస్తారో.. ఆశ్చ‌ర్యంలో న‌టి!
X

మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల‌కు ఇచ్చే గౌర‌వం, ప్రేమ‌ ఎంతో గొప్ప‌వి. ఫ్యాన్స్ సంక్షేమం కోసం ఆయ‌న కోట్లు ఖ‌ర్చు చేసారు. ల‌క్ష‌ల్లో విరివిగా డొనేష‌న్లు ఇచ్చారు. క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో త‌న అభిమానుల‌కు ఏ ర‌క‌మైన క‌ష్టం వ‌చ్చినా వారికోసం నేనున్నాను! అంటూ ముందుకు వ‌చ్చారు చిరు. కోట్లాది రూపాయ‌ల పెట్టుడులు పెట్టి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, విదేశీ ప‌రిక‌రాల‌ను తెచ్చి ప్ర‌తి జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లో అందుబాటులో ఉంచి సేవ‌లు చేసారు. నిత్యావ‌స‌రాల సాయం, ఆర్థికంగా విరాళాల సాయం, ఆస్ప‌త్రి బెడ్స్ ఏర్పాటు స‌హా ఎన్నో విష‌యాల‌లో ఒక మిష‌న్ లా ప‌ని చేసారు. అది త‌న‌కు అభిమానులు ఇచ్చిన బ‌లం అని న‌మ్ముతారాయ‌న‌.

తాజా ఇంట‌ర్వ్యూలో `విశ్వంభ‌ర` క‌థానాయిక ఆషికా రంగ‌నాథ్ మాట్లాడుతూ..అభిమానుల‌తో చిరంజీవి ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ఆయ‌న‌ ధృక్ప‌థం గురించి మాట్లాడారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న విశ్వంభ‌ర‌ సెట్లో చిరంజీవి ఎలా ఉండేవారో ద‌గ్గ‌ర‌గా చూసిన ఆషిక‌... ఆయ‌న ఓపిక‌కు ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్పారు. చిరంజీవి గారికి చాలా ఓపిక స‌హ‌నం ఎక్కువ అని, త‌న కోసం సెట్స్ కి వ‌చ్చే కొత్త‌వారిని అంద‌రితో స‌మానంగా గౌర‌విస్తార‌ని తెలిపారు. ఆయ‌న‌ ఎప్పుడూ బిజీగా గ‌డుపుతారని, ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే దానికి స‌మాధానంగా... దూరం నుంచి త‌న అభిమానులు వ‌స్తుంటార‌ని, అందువ‌ల్ల ఆదివారాలు కూడా తీరిక స‌మ‌యం ఉండ‌ద‌ని చెప్పిన‌ట్టు గుర్తు చేసుకున్నారు. ఈ త‌రం న‌టీన‌టుల‌కు ఇంత‌టి స‌హ‌నం లేదు. చిరును చూసి ప్ర‌తిదీ నేర్చుకోవాల‌ని కూడా ఆషిక సూచించారు.

విశ్వంభ‌ర‌లో త‌న పాత్ర గురించి ఎగ్జ‌యిట్ అయిన ఆషిక‌, ఇలాంటి అవ‌కాశం జీవిత కాలంలో ఒక్క‌సారే ల‌భిస్తుంద‌ని అన్నారు. త‌న పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంద‌ని కూడా తెలిపారు. పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌తో ముందు ప్ర‌చార హంగామా మొద‌ల‌వుతుంది. సంక్రాంతి నుంచి సమ్మ‌ర్ వ‌ర‌కూ విశ్వంభ‌ర‌కు ప్ర‌చార షెడ్యూల్ ఉంటుంద‌ని తెలిపారు. వేస‌విలో ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుద‌ల చేస్తార‌ని కూడా హింట్ ఇచ్చింది ఆషిక‌.

ఆషికా రంగ‌నాథ్ ఇంత‌కుముందు నాగార్జున స‌ర‌స‌న నా సామి రంగా చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత సిద్ధార్థ్ తో మిస్ యు అనే చిత్రంలో ఆడిపాడింది. ఈ ఏడాది చిరుతో విశ్వంభ‌ర‌, కార్తీతో స‌ర్ధార్ 2 చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. నేటిత‌రంలో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న క‌థానాయిక‌గా ఈ భామ‌కు గుర్తింపు ద‌క్కుతోంది. ఆషిక `గ‌త వైభ‌వ` (మ‌ల‌యాళం) అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రంలోను న‌టించింది. ఈ న‌వంబ‌ర్ 14న విడుద‌లైన‌ చిత్రంలో ఐదు విభిన్న‌మైన గెట‌ప్పుల‌తో ఆషిక స‌ర్ ప్రైజ్ చేసింది.