వేదికపై ఆర్టిస్టు భావోద్వేగం.. చిరుకు పాదనమస్కారం.. హృదయాల్ని హత్తుకున్న బాస్ పెద్ద మనసు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన 'మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్' వేడుకలో ఒక అరుదైన భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది.
By: Sivaji Kontham | 12 Aug 2026 11:53 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన 'మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్' వేడుకలో ఒక అరుదైన భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో నటుడు పొట్టి మామ మాట్లాడిన మాటలు.. అతడి కంటి నుంచి వెలువడిన ఆనంద భాష్పాలు సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతగానో కదలింపజేశాయి.
మైక్ పట్టుకుని మాట్లాడటం ప్రారంభించగానే పొట్టి మామ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను చిరంజీవి గారి పాటలకు డ్యాన్సులు చేస్తూ వచ్చాను. ఆ డ్యాన్సులు చూసే దర్శకుడు మేర్లపాక గాంధీ నన్ను గుర్తించి.. ఈ సినిమాలో నటించే గొప్ప అవకాశం ఇచ్చారు! అని చెబుతూ తన కళా జీవితానికి చిరంజీవే మూలకారణమని కృతజ్ఞత చాటుకున్నారు.
తన కల నెరవేరిన వేళ.. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధురమైన రోజు. చిరు సార్ దయ, ఆయన అందించిన పరోక్ష స్ఫూర్తి వల్లే నాకు ఈ సినిమాలో మంచి వేషం వచ్చింది! అని పొట్టి మామ సంతోషం వ్యక్తం చేశారు. ఒక సామాన్య నటుడిగా చిరంజీవి పాటలతో ప్రయాణం ప్రారంభించి.. ఈ రోజు ఆయన ముందే నిలబడి మాట్లాడటం తన అదృష్టమని పేర్కొన్నారు.
స్పీచ్ ముగిసిన వెంటనే వేదికపై నుంచి కిందకు దిగిన పొట్టి మామ.. సభా ప్రాంగణంలో ముందు వరుసలో కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో ఉదారంగా, ఆప్యాయంగా ఆయనను దగ్గరకు తీసుకొని తన పక్కనే కూర్చోబెట్టుకుని అభినందించడం ఆ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో బాస్ తో పొట్టి మామ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఇది ఒక సాధారణ వ్యక్తికి అరుదైన అవకాశం. సభ ఆద్యంతం ఎమోషనల్ దృశ్యంతో హృదయాలను గెలుచుకుంది.
