Begin typing your search above and press return to search.

బాలయ్యతో మెగాస్టార్ ముచ్చట్లు.. మల్టీస్టారర్ కాంబో సాధ్యమేనా?

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని తనదైన శైలిలో ఏలుతున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ NBK`.

By:  Srikanth Kontham   |   25 Oct 2026 9:21 PM IST
బాలయ్యతో మెగాస్టార్ ముచ్చట్లు.. మల్టీస్టారర్ కాంబో సాధ్యమేనా?
X

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని తనదైన శైలిలో ఏలుతున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ NBK`. నటసింహ బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ప్లాట్‌ఫామ్‌పై సాగుతున్న టాక్ షో ఇప్పటికే నాలుగు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అయితే ఈ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్‌లోనే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనానికి తెర తీస్తుంది. `అన్‌స్టాపబుల్ సీజన్ 5` ప్రారంభ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నార‌నే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.

టాలీవుడ్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న ఇద్దరు దిగ్గజ నటులు ఒకే వేదికపైకి రావడం అంటే అభిమా నులకు పండగనే చెప్పాలి. ఈ క్రేజీ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ కోసం రచయిత, దర్శకుడు బివిఎస్ రవి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని.. మంగళవారమే షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ- చిరంజీవిల కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎనభైల కాలం నుండి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతూనే వ్యక్తిగతంగా ఎంతో ఆప్యాయంగా ఉండే ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే టాక్ షోలో ముచ్చటించడం రికార్డులను తిరగరాయడం ఖాయం. దీంతో ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? అని ఇరు హీరోల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు బాలయ్య-చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రావడంపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో బోయపాటి శ్రీనుతో పాటు తమిళ దర్శకుడు నెల్సన్ లాంటి వారి పేర్లు మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం వినిపించాయి. స్వయంగా దర్శకులు కూడా కథ సిద్ధం చేస్తున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇద్ద‌రినీ ఒకే సినిమాలో భాగం చేయడం.. ఆ స్థాయి అంచనాలను అందుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదన్న‌ది విశ్లేషకుల అభిప్రాయం.

వెండితెరపై ఇద్దరు దిగ్గజాల మల్టీస్టారర్ సినిమా కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది పక్కన పెడితే `అన్‌స్టాపబుల్ 5` టాక్ షో ద్వారా ఇద్ద‌రు ఒకే స్క్రీన్‌పై కనిపించ బోతున్నారనే వార్త మాత్రం అభిమానుల్లో జోష్ ఇస్తోంది. మంగళవారం జ‌రిగే షూటింగ్ అనంతరం ఎపిసోడ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన లేదా ప్రోమో వస్తే క్రేజ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం.