వెండితెరపై తొలిసారి మెరిసిన చిరంజీవి...ఒక మధుర జ్ఞాపకం
ఈ రోజు ఆయన మెగా స్టార్. దాదాపు అయిదు దశాబ్దాల సినీ చరిత్ర ఆయన సొంతం. తెలుగు సినిమాను పరుగులు తీయించి మరో పది మెట్లు ఎక్కించిన పద్మ విభూషణుడు ఆయన.
By: Satya P | 22 Sept 2026 6:16 PM ISTఈ రోజు ఆయన మెగా స్టార్. దాదాపు అయిదు దశాబ్దాల సినీ చరిత్ర ఆయన సొంతం. తెలుగు సినిమాను పరుగులు తీయించి మరో పది మెట్లు ఎక్కించిన పద్మ విభూషణుడు ఆయన. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతకు అచ్చమైన నిజం చిరంజీవి. ఆయన తొలి చిత్రం పునాది రాళ్ళు. అయితే విడుదల అయిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రం 1978 సెప్టెంబర్ 22న విడుదల అయింది. అంటే ఇప్పటికి సరిగ్గా నలభై ఎనిమిది ఏళ్ల కిందటి మాట అన్న మాట. ఈ మూవీలో చిరంజీవి ఒక కీలక పాత్ర పోషించారు. గ్రామీణ యువకుడిగా ఆయన మొదటి సినిమాతోనే తన నటనా చాతుర్యాన్ని చూపించి అందరినీ ఆకట్టుకున్నారు.
కళ్ళతోనే కట్టి పడేస్తూ :
చిరంజీవికి అతి పెద్ద ఆస్తి ఆయన కళ్ళు. ఆ కళ్ళతో ఆయన నాటి ప్రేక్షకులను కట్టిపడేశారు. అవే కళ్ళతో ప్రేమను మరో వైపు ఆవేశాన్ని చూపిస్తూ తన నిండైన నటనను ప్రదర్శించారు. ప్రాణం ఖరీదు సినిమాలో ఉద్ధండులు అయిన నటవర్గం ఉంది. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, రమాప్రభ ఇలా ఆనాటికే ప్రసిద్ధులైన నటీ నటులు ఉన్నారు. కానీ కొత్తగా పరిచయం అయిన చిరంజీవి సినిమాకు అతి ముఖ్య ఆకర్షణగా మారారు అంటే అది ఆయన నటనా పటిమగా ఒప్పుకుని తీరాలి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి ఒక యుగళ గీతం ఉంది. ఆయన పక్కన జతగా రేష్మా రాయ్ నటించారు.
తనదైన స్టెప్స్ తోనే :
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా అంటూ సాగే ఈ డ్యూయెట్ లో చిరంజీవి తనదైన స్టెప్ లతో సొగసుని నాడే చూపించారు. ఆయనకు తొలి పాటకు గొంతును అరువిచ్చింది గాయకుడు జి ఆనంద్. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట నాటికీ నేటికీ సూపర్ హిట్. ఫక్తు జానపద బాణీతో సాగే ఈ పాటను జాలాది రచించారు. పల్లెసీమ అందాల మధ్య చిత్రీకరించిన ఈ పాట బ్లాక్ అండ్ వైట్ లోనూ చిరంజీవి మెరుపులు వెండితెర మీద అందంగా చూపించింది. అప్పటికి 23 ఏళ్ళ యువకుడు అయిన చిరంజీవి మంచి ఈజ్ తో ఈ మూవీలో తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ నటుడు సమీప భవిష్యత్తులో వెండి తెరను దశాబ్దాల పాటు తన స్టార్ డం తో ఏలే మెగాస్టార్ అవుతారు అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అది జరిగింది అంటే దాని వెనక చిరంజీవి పట్టుదల పరిశ్రమ ఎంతగానో ఉన్నాయని చెప్పాలి.
వరస సినిమాలతో :
ఇక ప్రాణం ఖరీదు 1978లో రిలీజ్ అయితే మరుసటి ఏడాదికే చిరంజీవి బిజీ అయిపోయారు. ఆయన పున్నమి నాగు రిలీజ్ అయింది ఆ ఏడాదే. అలా వేగంగా యువ కెరటంగా దూసుకుని వచ్చిన చిరంజీవి 1983 నాటికి స్టార్ డం సాధించి ఖైదీ మూవీతో జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు సినిమాని ఒక అద్భుతమైన మలుపు తిప్పి తనతో పాటుగానే జోరు చేయించిన చిరంజీవి టాలీవుడ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇక ప్రాణం ఖరీదు మూవీలో చిరంజీవికి తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాత క్రాంతికుమార్ తరువాత కాలంలో చిరంజీవి హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. మొత్తానికి ప్రాణం ఖరీదు మూవీ అంటే కండలు తిరిగిన నవ యువకుడు చిరంజీవి కళ్ల ముందు కదలాడుతాడు. వెండితెర పైన ఒక మధుర జ్ఞాపకంగా అందమైన సంతకంగా చిరు ముద్ర వేసిన నేపథ్యం సైతం మెదుతులుతుంది.
