Begin typing your search above and press return to search.

మరోసారి పోలీసులను ఆశ్రయించిన మెగాస్టార్..

ఇకపోతే మరొకవైపు చిరంజీవి మాత్రమే కాదు మోహన్ బాబు , నాగార్జున అటు బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

By:  Madhu Reddy   |   29 Oct 2025 3:03 PM IST
మరోసారి పోలీసులను ఆశ్రయించిన మెగాస్టార్..
X

మెగాస్టార్ చిరంజీవి మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎక్స్ హ్యాండిల్ ద్వారా కొంతమంది తన పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ తనను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారు అంటూ సదరు ట్విట్టర్ హ్యాండిల్స్ ను చిరంజీవి పోలీసుల ముందు ఉంచారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపడుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కొంత మంది తనను టార్గెట్ గా చేసుకొని అత్యంత దారుణంగా దూషిస్తున్నారు అని వెంటనే తనపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి తెలిపినట్లు సమాచారం. ఇలా చిరంజీవి మళ్ళీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితమే చిరంజీవి సోషల్ మీడియాలో తన పేరును, ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారని.. వెంటనే సదరు వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీవీసీ సజ్జనార్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సిటీ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ మేరకు ఈయన పిటిషన్ ను పరిశీలించిన సిటీ సివిల్ కోర్టు ఇకపై ఎవరైనా చిరంజీవి ఫోటోలను, వాయిస్ ను అనధికారికంగా ఉపయోగించినట్లు తెలిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు సీపీవీసీ సజ్జనార్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్నాము.. ఇకపై ఎవరైనా ఆయనకు సంబంధించిన విషయాలను, ఆయన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టినా ..ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఇంతలోనే మళ్లీ ఆయనను ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేసుకొని కొంతమంది దుండగులు కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. మరి దీనిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇకపోతే మరొకవైపు చిరంజీవి మాత్రమే కాదు మోహన్ బాబు , నాగార్జున అటు బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఫోటోలను టీ షర్టులపై ప్రింట్ చేస్తున్నారని, తమ ఫోటోలను వాడుకుంటున్నారని, పైగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని, బహిరంగ ప్రదేశాలలో తమ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, తమ అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా తమ ఫోటోలు ఉపయోగించుకొని లాభపడుతున్నారు అంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక వీరందరికీ కూడా అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అయితే చిరంజీవి విషయంలోనే.. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగడం నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం అని చెప్పవచ్చు.