టీనేజ్ అమ్మాయికి నాన్నగా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో అలరించడానికి సిద్ధమవుతున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 10 April 2026 4:45 PM ISTమెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో అలరించడానికి సిద్ధమవుతున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చిరంజీవి టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ పాత్రపై ఆసక్తి నెలకొంది. గతంలో `చూడాలని ఉంది`, `డాడీ`, `స్టాలిన్` వంటి చిత్రాల్లో తండ్రి పాత్రలో మెప్పించిన చిరంజీవి చాలా కాలం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథను ఎంచుకోవడం విశేషం. ఈ ప్రచారం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమా కథా నేపథ్యం ప్రధానంగా కోల్‌కతా నగరంలో సాగుతుందని తెలుస్తోంది. గతంలో కోల్‌కతా నేపథ్యంలో `చూడాలని ఉంది` బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మళ్లీ అదే బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్ ఫుల్ మాఫియా కథకు తండ్రి-కూతుళ్ల ఎమోషన్ తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుందని బాబీ భావిస్తున్నట్లున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కేవలం సెటిల్డ్ గానే కాకుండా తన కూతురి కోసం ఏదైనా చేసే గంభీరమైన వ్యక్తిగా ఉంటుందని సమాచారం. చిరంజీవి కుమార్తె పాత్ర కోసం చిత్ర యూనిట్ ఓ యంగ్ హీరోయిన్ కోసం అన్వేషిస్తోందని తెలిసింది.
అనస్వర రాజన్ లేదా ప్రీతి ముకుందన్ వంటి వర్ధమాన నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒక తండ్రిగా చిరంజీవి చేసే పోరాటం వారి మధ్య ఉండే అనుబంధం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ సినిమాల హవా నడుస్తోన్న కాలంలో మెగాస్టార్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి కథకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి పాత్రను ఎంచుకోవడం ఆసక్తికరం. ఈ చిత్రం కోసం చిరంజీవి తన లుక్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టీనేజ్ అమ్మాయికి తండ్రిగా కనిపించడమే కాకుండా? సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో మరింత స్టైలిష్ గా, యంగ్ గా కనిపించనున్నట్లు సమాచారం.
బాబీ మునుపటి చిత్రం `వాల్తేరు వీరయ్య`లో చిరంజీవిలోని మాస్ కోణాన్ని ఆవిష్కరించగా ఈ సినిమాలో మాత్రం క్లాస్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన సెంటిమెంట్ ను మిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది పక్కా బాబి మార్క్ ఎంటర్ టైనర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఎలాంటి కథను తీసుకున్నా? కమర్శియల్ గా కనెక్ట్ చేయడంలో దిట్ట. అందుకే మెగాస్టార్ కూడా పెద్దగా ఆలోచించకుండానే బరిలోకి దిగిపోతున్నారు. 2027లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మరోసారి అద్భుతమైన నటనతో తండ్రి పాత్రలో మెప్పించి బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
