తొక్కేయడం.. బాస్ అన్నీ గమనిస్తున్నాడు
సందీప్ కిషన్ సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక సరదా కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 26 Sept 2026 9:58 AM ISTసందీప్ కిషన్ సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక సరదా కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో స్టేజ్ మీద మాట్లాడుతూ నన్ను తొక్కేయాలని చూస్తున్నావా అని చిరు వేసిన సెటైర్ మామూలుగా పేలలేదు. పైకి ఇది ఫరియాను ఆటపట్టించడానికి అన్నట్టుగా కనిపిస్తున్నా దీని వెనుక నెట్టింట నడిచే ఒక పెద్ద ట్రెండ్ ఉందనే విషయం నెటిజన్లకు ఇట్టే కనెక్ట్ అయింది.
గత కొన్నేళ్లుగా ఆన్లైన్ లో ఏదైనా చిన్న సినిమా ఫ్లాప్ అయినా, లేక ఏ నటుడు గ్యాప్ తీసుకున్నా వెంటనే బాస్ తొక్కేశాడు అంటూ కామెంట్స్ రావడం ఒక కామన్ ట్రెండ్ గా మారింది. కావాలనే ఒక వర్గం సరదా కోసం ఈ మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లకు కూడా తెలుసు అందులో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం అదొక టైమ్ పాస్ ట్రోలింగ్ అని.
అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే బాస్ అన్నీ గమనిస్తున్నాడు. సోషల్ మీడియాలో నడిచే ఇంత చిన్న ట్రోలింగ్ పదాన్ని కూడా చిరంజీవి ఫాలో అవుతున్నాడనే విషయం సిగ్మా ఈవెంట్ సాక్షిగా అందరికీ అర్థమైంది. తన మీద వచ్చే మీమ్స్, నెగిటివ్ టాగ్స్ ను ఆయన ఎంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారో ఈ ఒక్క డైలాగ్ తో జనాలకు భలే క్లారిటీ వచ్చేసింది.
ఈవెంట్ లో ఫరియాతో తనకున్న డాన్స్ ఎక్స్పీరియన్స్ ను పంచుకున్న చిరు, విశ్వంభర సినిమాలో ఫరియాతో డాన్స్ చేసే ఛాన్స్ ఎందుకు రాలేదని నవ్వుతూ అడిగారు. ఇద్దరి మధ్య హైట్ ప్రాబ్లమ్ అయితే తాను ప్రత్యేకంగా హీల్స్ వేసుకునేవాడిని కదా అంటూ హుషారుగా మాట్లాడారు. ఆ ఫ్లోలోనే నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు, నన్ను తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నాను అని చిరు అనగానే స్టేజ్ మొత్తం నవ్వులతో దద్దరిల్లింది.
తన మీద నెట్టింట ఏళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఎంత లైట్ గా తీసుకుంటారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకుని ఫీల్ అవ్వకుండా, దాన్ని కూడా ఒక కౌంటర్ జోక్ గా మార్చేయడం ఆయన స్పోర్టివ్ నెస్ కు నిదర్శనం. నెగిటివిటీని కూడా చిరునవ్వుతో స్వీకరించే ఆయన ఆటిట్యూడ్ చూసి సినిమా జనాలు ఫిదా అవుతున్నారు.
ట్రోలర్స్ కావాలని వాడే పదాన్ని తీసుకుని స్టేజ్ మీద ఓపెన్ గా పంచ్ వేయడం నిజంగా చిరుకే చెల్లింది. వాళ్లకు సీరియస్ గా క్లాస్ పీకడం కంటే ఇలా నవ్వుతూ వేసిన సెటైర్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంటర్నెట్ లో జరిగేది బాస్ కు అంతా తెలుసు, కాకపోతే చూసీచూడనట్టు వదిలేసి చాలా సరదాగా తీసుకుంటాడు అనే విషయం ఈ ఇన్సిడెంట్ తో పక్కాగా ప్రూవ్ అయింది.
