5 దశాబ్దాల ప్రయాణం.. జీ.వీ. నారాయణరావు మరణంపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో ఎంతోమంది సీనియర్ నటులకు మంచి అనుబంధమున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 28 Aug 2026 12:14 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో ఎంతోమంది సీనియర్ నటులకు మంచి అనుబంధమున్న విషయం తెలిసిందే. అయితే ఆ అనుబంధాన్ని ఆయన దశాబ్దాల తరబడి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అలాంటి అనుబంధం ఒక్కసారిగా తెగిపోతే.. ఆ క్షణం వర్ణనాతీతం ..ఇప్పుడు అదే క్షణాలు తన మనసులో తనను దుఃఖానికి గురిచేస్తున్నాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఐదు దశాబ్దాల ప్రయాణం మాది - చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణరావుతో ఆయనకు పరిచయం ఏర్పడింది . 1977లో మొదలైన పరిచయం ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం గమనార్హం . అలాంటి జీవి నారాయణ రావు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. నారాయణ రావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ ఆయనతో పనిచేసిన రోజులను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
జీవీ నారాయణ రావు అంత్యక్రియలలో చిరంజీవి ఎమోషనల్..
జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆగస్టు 27న పలువురు ప్రముఖులు , కుటుంబ సభ్యుల సమక్షంలో జీవీ నారాయణ రావు అంత్యక్రియలు ముగిసాయి. ఈ అంత్యక్రియలలో పాల్గొన్న చిరంజీవి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. "నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, నిర్మాత గానే కాకుండా వ్యక్తిగతంగా మా మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. నేను నటించిన దేవాంతకుడు, యముడికి మొగుడు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా ఈ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మాకు మిగిలాయి. జీవి నారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జీ.వీ.నారాయణ కుటుంబ సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులే. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
జీవి నారాయణరావు కెరియర్..
1976లో అంతులేని కథ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు జీవి నారాయణరావు. ఈ చిత్రానికి కే బాలచందర్ దర్శకత్వం వహించారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి నటించిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాలలో జీవి నారాయణరావు నటించారు కూడా.
ఈయన పలు టెలివిజన్ సీరియల్స్ లో కూడా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏదేమైనా టాలీవుడ్ సినీ పరిశ్రమ నారాయణరావు లాంటి ఒక మంచి నటుడిని, నిర్మాతను కోల్పోయిందని.. పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
