చరణ్ క్రమశిక్షణ, దైవభక్తి, విలువలు గౌరవాన్ని పెంచాయి: చిరంజీవి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు (మార్చి 27) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
By: Sivaji Kontham | 27 March 2026 11:30 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు (మార్చి 27) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి అత్యంత ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ చిన్ననాటి అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తండ్రిగా తాను ఎంత గర్వపడుతున్నారో చిరంజీవి వివరించారు. చరణ్ క్రమశిక్షణ, దైవభక్తి, విలువలు తనలో గౌరవాన్ని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బాలుడిగా ఉన్న చరణ్ తో పాటు ఉన్న కొన్ని ఫోటోలను చిరు షేర్ చేయగా వాటికి అద్భుత స్పందన వస్తోంది. చరణ్ ఈ ఫోటోగ్రాఫ్స్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. చిరు పోస్ట్ పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల వెంటనే స్పందించారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన తన కుమార్తె అన్వీరను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి షేర్ చేసిన మూడవ ఫోటోలో చరణ్ సరిగ్గా అన్వీర లాగే ఉన్నారని ఉపాసన కామెంట్ చేశారు. దీనిని చూసిన మెగా అభిమానులు `కార్బన్ కాపీ` అంటూ సంబరపడిపోతున్నారు. చరణ్ సోదరి సుస్మిత కొణిదెల కూడా తన తమ్ముడిని ``మా బలం- మా గర్వం`` అని అభివర్ణిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ కి మెగా హీరోలు అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
మరోవైపు చరణ్ నటిస్తున్న తాజా చిత్రం `పెద్ది` సెట్స్‌లో అతడికి చిన్న గాయం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. షూటింగ్ సమయంలో చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం కావడంతో చిన్నపాటి చికిత్స జరిగింది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చరణ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రేపటి నుండే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పెద్ది` ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ సరసన జానవీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా ప్రత్యేక అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగి, తనదైన ముద్ర వేస్తున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నారు. తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో, మెగా కుటుంబంలో ఈ వేడుకలు రెట్టింపు ఉత్సాహంతో జరుగుతున్నాయి. రామ్ చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా సాగాలని మనమూ కోరుకుందాం.
