గుసగుస: చిరంజీవి సార్ పంచ్ ఏసేశారు!
ఇదే సమయంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ `పెద్ది` సినిమాకు అందించిన పరిణతి చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను చిరంజీవి ఆకాశానికెత్తారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 10:14 AM ISTదర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన `పెద్ది` రీరికార్డింగ్ - పాటల గురించి చాలా చర్చ సాగుతోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (రీరికార్డింగ్) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో.. సంగీత ప్రియులలో పెద్ద చర్చకు దారితీశాయి. వాస్తవంగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లకు నేడు బీజీఎం విషయంలో అంత స్పష్టత ఉండటం లేదు. ప్రతి సీన్‌లోనూ ఇరగదీస్తూ డోలు వాయించేస్తే అదేదో అద్భుతమైన మ్యాజిక్ అని భ్రమిస్తున్నారు. కానీ కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా థియేటర్‌లో ఆడియన్స్‌కు గొప్పగా వినిపిస్తుంది.. ఎంతో సందేశాన్ని ఇస్తుంది. ఇలాంటి అద్భుతమైన టెక్నిక్‌ను గతంలో ఆర్జీవీ, మణిరత్నం లాంటి ప్రముఖులు వారి సినిమాల్లో అద్భుతంగా ఉపయోగించారు. ఇళయరాజా అలాంటి సృజనాత్మకతకు ఆద్యుడని నిరూపించారు. అయితే నేటితరం మ్యూజిక్ డైరెక్టర్లు తమ పనిపాటవాన్ని ఎక్కువగా చూపించుకునే ఆత్రుతలో, సందర్భానుసారంగా అక్కడ ఆర్.ఆర్. అవసరం లేదనే విషయాన్ని గుర్తించకుండా అతిగా శబ్దాలు ఇస్తూ ఏదో సాధించాలని తపిస్తున్నారు.
ప్రస్తుతం కమర్షియల్ సినిమాలలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్లలో చెవులు పగిలిపోయేలా, విపరీతమైన డ్రమ్స్ .. బేస్ సౌండ్స్ వాడటం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. దీనిపైనే మెగాస్టార్ సున్నితమైన విమర్శలు చేస్తూ నేటి ట్రెండ్‌ను ``ఊకదంపుడుగా కొట్టేసి.. అవసరాన్ని మించి కొట్టేయడం`` అని గట్టిగానే చురకలు వేసారు. సీన్‌లో అంత ఇంటెన్సిటీ లేకపోయినా,కేవలం శబ్దాల రొదతో మ్యూజిక్ ద్వారానే సీన్‌ను లేపాలని చూసే కొందరు అగ్ర సంగీత దర్శకుల ధోరణిని ఆయన తన సుదీర్ఘ సినీ అనుభవంతో సున్నితంగా తప్పుపట్టారు. పెద్ద పెద్ద శబ్దాలు చేయడం వల్ల మాత్రమే సీన్లు పండవని.. అసలైన సంగీతం అనేది ప్రేక్షకుల హృదయాన్ని తాకాలన్నారు. కేవలం థియేటర్లలో రచ్చ చేయడం కోసం కాకుండా.. మన మనసులోని ఫీలింగ్‌ను బట్టి గుండెను పిండే విధంగా రీ-రికార్డింగ్ ఉండాలని ఆయన తనదైన శైలిలో స్పష్టం చేశారు. సంగీతం అనేది సీన్‌ను ఓవర్‌డామినేట్ చేయకుండా.. అందులోని భావోద్వేగాన్ని మరింత పెంచేలా ఉండాలని విశ్లేషించారు.
ఇదే సమయంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ `పెద్ది` సినిమాకు అందించిన పరిణతి చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను చిరంజీవి ఆకాశానికెత్తారు. రెహ్మాన్ ఎక్కడ ఎంత సౌండ్ అవసరమో! ఏ భావానికి ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్ వాడాలో అంతవరకే పక్కాగా వాడారని కొనియాడారు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్.. ఆ సీన్ తీవ్రత.. గ్రామీణ మట్టి నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దానికి పరిపూర్ణ న్యాయం చేశారని... అందుకే రెహ్మాన్ ఈ సినిమాకు ఒక `మెయిన్ పిల్లర్`గా నిలిచారని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. శబ్దాల హోరు లేకుండా కూడా కేవలం సంగీతంలోని లయతోనే ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చో ఈ సినిమాతో ఆయన నిరూపించారని పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఒక అత్యంత ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. సినిమాలో హీరో రామ్ చరణ్ నేరుగా స్క్రీన్ మీద లేకుండా కేవలం అతని విగ్రహాన్ని చూపిస్తూ ఎలివేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు.. రెహ్మాన్ తన అద్భుతమైన మ్యూజిక్ ద్వారా ఆ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. అనవసరపు సౌండ్స్ ఏవీ లేకుండా కూడా కేవలం సంగీతంలోని లయ- ఇంటెన్సిటీ ద్వారా హీరో రేంజ్‌ను ఎలివేట్ చేయవచ్చని రెహ్మాన్ చాటిచెప్పారు. హీరో ఫిజికల్‌గా లేకపోయినా ఆ సీన్‌ను నిలబెట్టే సత్తా కేవలం క్లాసిక్ మ్యూజిక్‌కే ఉంటుందని ఈ ఉదాహరణతో స్పష్టమైంది.
ఆర్.ఆర్ నాణ్యత గురించి చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని ప్రస్తుత కమర్షియల్ లెక్కలకు.. లౌడ్ మ్యూజిక్ ట్రెండ్‌కు ఒక పెద్ద కనువిప్పు లాంటివి. కేవలం థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయేలా ఆర్.ఆర్ ఇవ్వడం వల్ల తాత్కాలికంగా విజిల్స్ పడొచ్చు ఏమో కానీ.. అది సినిమాను ఎప్పటికీ ఒక క్లాసిక్‌గా మార్చలేదు. `పెద్ది` లాంటి స్వచ్ఛమైన నేటివిటీ కథలకు నిశ్శబ్దాన్ని కూడా సంగీతంగా మార్చగల ఏఆర్ రెహ్మాన్ లాంటి మేధావుల అవసరం పరిశ్రమకు ఎంతైనా ఉందనే నిజాన్ని మెగాస్టార్ చిరంజీవి తన అనుభవపూర్వక వ్యాఖ్యల ద్వారా ఇండస్ట్రీకి గట్టిగానే అర్థమయ్యేలా చెప్పారు. రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలనే బుచ్చిబాబు సనా థింకింగ్ కూడా గ్రేట్ అని అంగీకరించాలి.
