చిరు బాబీ మూవీ.. ఇప్పుడు మరో టెన్షన్..
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బాబీతో ఆయన కాంబినేషన్ ఇప్పటికే వాల్తేరు వీరయ్య రూపంలో భారీ విజయాన్ని అందుకుంది.
By: M Prashanth | 30 March 2026 3:14 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బాబీతో ఆయన కాంబినేషన్ ఇప్పటికే వాల్తేరు వీరయ్య రూపంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకోవడంతో, ఆ కాంబోపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే జోడీ మరోసారి కలిసి పనిచేయనున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.
ఆ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రారంభం నుంచే ఆ సినిమా మీద భారీ హైప్ ఉండగా, మధ్యలో కొన్ని రూమర్స్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆర్థిక సమస్యల్లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందా అనే సందేహాలు మెగా ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియుల్లో కలిగాయి.
అయితే ఆ ఊహాగానాలపై నిర్మాణ సంస్థ స్పందించింది. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అన్ని ప్రాజెక్టులు ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు కొంత ఊరట పొందారు. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో కథ విషయంలో మరో చర్చ మొదలైంది. స్క్రిప్ట్ పై చిరంజీవి సంతృప్తి చెందలేదన్న టాక్ వినిపించింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నందున, ఈసారి కథ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మెగాస్టార్ భావిస్తున్నారట. అందుకే స్క్రిప్ట్‌ను మరింత బలంగా తయారు చేయాలని దర్శకుడు బాబీకి సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై బాబీ కూడా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారని సమాచారం. కథను మరింత ఆకట్టుకునేలా మార్చేందుకు టీమ్ కష్టపడుతుందని తెలుస్తోంది.
ఈ పరిణామాలతో కథ విషయంలో ఉన్న అనుమానాలు కొంత వరకు తగ్గినట్లే కనిపించాయి. అయితే తాజాగా మరో అంశం ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచుతోంది. ఆ సినిమాకు రచయితగా కోన వెంకట్ పనిచేస్తున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో కోన వెంకట్ వరుస హిట్స్ ఇచ్చినప్పటికీ, ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
ముఖ్యంగా ఆయన ఇటీవల చేసిన ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో, అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ సినిమా విషయంలో ఆ మూవీ నచ్చకపోతే తన తర్వాతి ప్రాజెక్ట్ చూడొద్దని చెప్పడం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా-బాబీ ప్రాజెక్ట్ లో ఆయన భాగస్వామ్యం ఉండటంపై కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా చిరంజీవి- బాబీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మధ్య మధ్యలో వస్తున్న వార్తలు అభిమానులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. అయితే సినిమా టీమ్ మాత్రం అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటూ, గ్రాండ్ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలుస్తోంది.
