Begin typing your search above and press return to search.

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు స్పెష‌ల్ గిఫ్ట్.. AP గ్రీన్ ఛైర్మన్‌గా పర్యావరణ సందేశం

సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజులు కేక్ కటింగ్‌లు, ఫ్యాన్స్ సందడి, స్పెష‌ల్ ఈవెంట్స్ తో జరుపుకోవడం కనిపిస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Aug 2026 4:17 PM IST
చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు స్పెష‌ల్ గిఫ్ట్.. AP గ్రీన్ ఛైర్మన్‌గా పర్యావరణ సందేశం
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన త‌మ్ముడు, నటుడు- నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజులు కేక్ కటింగ్‌లు, ఫ్యాన్స్ సందడి, స్పెష‌ల్ ఈవెంట్స్ తో జరుపుకోవడం కనిపిస్తుంది. అయితే చిరంజీవి పుట్టిన‌రోజుని మాత్రం పర్యావరణ పరిరక్షణకు ముడిపెడుతూ నాగబాబు ఓ మొక్కను నాటారు. దీంతో ఈ సెల‌బ్రేష‌న్స్ కు వ్యక్తిగత అనుబంధంతో పాటు సోష‌ల్ మెసేజ్ కూడా జతైంది.

హైదరాబాద్‌లోని కోకాపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పెష‌ల్ గా కదంబ వృక్షాన్ని నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం ఏరియాలోని నర్సరీల నుంచి ఈ మొక్కను తీసుకొచ్చినట్లు నాగబాబు తెలిపారు. కదంబ వృక్షం దట్టమైన పచ్చదనంతో పెరగడంతో పాటు మంచి నీడను అందించే చెట్లలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఆకృతి కలిగిన పువ్వులు కూడా ఈ చెట్టుకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయని వివరించారు.

అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం అన్నయ్య పుట్టినరోజు వేడుకగా చూడకుండా.. ఓ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా నాగబాబు మలిచారు. బ‌ర్త్ డేలు, ఇతర ప్రత్యేక సందర్భాలను టెంప‌ర‌రీ సెల‌బ్రేష‌న్స్‌కే పరిమితం చేయకుండా, ఫ్యూచ‌ర్ కు ఉపయోగపడేలా ఒక మొక్కను నాటే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పుట్టినరోజున నాటిన మొక్క సంవత్సరాలు గడిచేకొద్దీ పెరిగి, పర్యావరణానికి ఉపయోగపడటంతో పాటు ఆ సందర్భాన్ని శాశ్వత జ్ఞాపకంగా నిలబెడుతుందన్నది ఆయన సందేశ‌మిచ్చారు.

ఇదే సమయంలో ఏపీ గ్రీన్ చైర్మ‌న్ గా నాగబాబు చేపడుతున్న పర్యావరణ కార్యక్రమాలకు కూడా ఈ వేడుక మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. తన ఫ్యామిలీ మెంబ‌ర్స్ పేర్లతో ఇప్పటికే 120కి పైగా మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితరుల పేర్లతో ఈ మొక్కలు నాటినట్లు తెలిపారు.

చిరంజీవి బ‌ర్త్ డే ను పురస్కరించుకుని కదంబ వృక్షాన్ని నాటడం ద్వారా నాగబాబు ఒకవైపు అన్నయ్యపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే, మరోవైపు పర్యావరణ పరిరక్షణపై తన బాధ్యతను గుర్తుచేశారు. అదే సమయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా తమకు ఇష్టమైన వారి ప్ర‌త్యేక రోజుల‌ను ఓ మొక్క నాటి గుర్తుండిపోయేలా చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఈసారి చిరంజీవి బర్త్‌డే సెల‌బ్రేష‌న్ కు గ్రీన్ గిఫ్ట్ అనే కొత్త అర్థం తోడైంది.