Begin typing your search above and press return to search.

ఒకటి సెట్టయ్యింది.. కానీ 'విశ్వంభర'కే ఎందుకిలా..

పైగా చిరంజీవి లైనప్ కూడా ఇప్పుడు కాస్త టైట్ అయింది. ‘కాకా’కు సంక్రాంతి 2027 డేట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ కావచ్చు.

By:  M Prashanth   |   23 Aug 2026 12:10 PM IST
ఒకటి సెట్టయ్యింది.. కానీ విశ్వంభరకే ఎందుకిలా..
X

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రెండు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ టైటిల్, గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. 2027 జనవరి 13న సినిమా వస్తుందని క్లియర్ చేశారు. కానీ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘విశ్వంభర’ మాత్రం మళ్లీ పోస్టర్, సంగీతం దగ్గరే ఆగిపోయింది.

ఇక్కడే అసలు తేడా కనిపిస్తోంది. ‘కాకా’ షూటింగ్ ఇంకా పూర్తికాకపోయినా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మరోవైపు ‘విశ్వంభర’ చాలా కాలం కిందటే మొదలై, రిలీజ్ కూడా ఒకసారి వాయిదా పడింది. అయినా ఇప్పటికీ కొత్త డేట్ మాత్రం బయటకు రాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 16 అనే తేదీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నా మేకర్స్ మాత్రం దాన్ని అధికారికంగా చెప్పలేదు.

‘విశ్వంభర’ ఆలస్యానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన కారణమనే టాక్ చాలాకాలంగా ఉంది. సినిమా ఫాంటసీ జానర్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా ఎక్కువే. కానీ ఒక దశ దాటాక అభిమానులు అప్డేట్ కంటే డేట్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పుట్టినరోజు లాంటి పెద్ద సందర్భంలో కూడా అది రాకపోవడంతో సినిమా నిజంగా ఎప్పుడు సిద్ధమవుతుందన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చింది.

పైగా చిరంజీవి లైనప్ కూడా ఇప్పుడు కాస్త టైట్ అయింది. ‘కాకా’కు సంక్రాంతి 2027 డేట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ కావచ్చు. ఇక ‘విశ్వంభర’ కాకా కంటే ముందే రావాలంటే ఈ ఏడాదిలోనే మంచి స్లాట్ పట్టుకోవాలి. లేదంటే రెండు సినిమాల మధ్య గ్యాప్, ప్రమోషన్స్, థియేటర్ ప్లానింగ్ అన్నీ మళ్లీ కొత్తగా లెక్కించాల్సి ఉంటుంది.

ఇంకో విషయం కూడా ఉంది. ‘విశ్వంభర’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా ఇంకా యాక్టివ్ లోనే ఉందనే నమ్మకం ఇస్తోంది కానీ, రిలీజ్ ప్లాన్ మాత్రం చెప్పడం లేదు. ఒక పెద్ద సినిమా విషయంలో పోస్టర్లు, పాటలు, సంగీతం కంటే చివరకు ప్రేక్షకుడికి కావాల్సింది థియేటర్ డేట్. అదే క్లారిటీ లేకపోతే ప్రతి కొత్త అప్డేట్ తర్వాత కూడా అదే ప్రశ్న తిరిగి వస్తుంది. అందుకే ఈసారి చిరంజీవి బర్త్‌డేలో ‘కాకా’ కంటే ‘విశ్వంభర’ గురించే ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి మెగాస్టార్ చొరవ తీసుకొని ఏదైనా డేట్ ను ఫైనల్ చేస్తారేమో చూడాలి.