సోషల్ మీడియాలో 'మెగా బర్త్‌డే' హంగామా షురూ
తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం అంటే ఆయన అభిమానులకు ఒక పెద్ద పండుగ రోజు.
By: Sivaji Kontham | 21 Aug 2026 7:13 PM ISTతెలుగు సినీ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం అంటే ఆయన అభిమానులకు ఒక పెద్ద పండుగ రోజు. 22 ఆగస్టు మెగా బాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా యూట్యూబ్ లైవ్ చాట్స్‌లో అభిమానులు ఆయనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అధికారికంగా పుట్టినరోజు రాకముందే అభిమానులు లైవ్ చాట్‌లను `అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే బాస్`, `జై మెగాస్టార్` అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఓవైపు హైదరాబాద్ లో మెగా ఫ్యాన్స్ స్పెషల్ బర్త్ డే పార్టీలో సందడి చేస్తుండగా, సోషల్ మీడియాల్లో ఈ బిగ్ డిబేట్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అభిమానులు చిరంజీవిని కేవలం ఒక నటుడిగానే కాకుండా తమ సొంత ఇంట్లోని పెద్ద దిక్కుగా భావిస్తారు. చాట్‌లో వచ్చిన కామెంట్లను పరిశీలిస్తే.. అత్యధిక శాతం మంది అభిమానులు ఆయనను`అన్నయ్య` అని సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. `హ్యాపీ బర్త్‌డే అన్నయ్య``, `పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి అన్నయ్య`` అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తమ గుండెల్లో ఆయనకు ఉన్న స్థానాన్ని చాటుకుంటున్నారు.
చిరంజీవి వర్సటైలిటీ - ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ అభిమానులు రకరకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు ఆయనను `కింగ్ ఆఫ్ టాలీవుడ్` అని అభివర్ణిస్తే.. మరికొందరు ఈ తరం ``వన్ అండ్ ఓన్లీ ఆల్‌రౌండర్`` అంటూ ప్రశంసిస్తున్నారు. తరాలు మారినా, దశాబ్దాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద ఆయనకున్న క్రేజ్, స్టార్‌డమ్ కొంచెమైనా తగ్గలేదనడానికి ఈ కామెంట్లే నిదర్శనం.
మెగాస్టార్ సినీ ప్రయాణంలో మొదటి నుంచి ఆయనతోనే ఉన్న పాత తరం అభిమానులు కూడా ఈ శుభాకాంక్షల మహోత్సవంలో భాగమయ్యారు. `ఖైదీ` సినిమా కాలం నుండి ఇప్పటివరకు తాను చిరంజీవి గారి అభిమానిగానే ఉన్నానని ఒక అభిమాని గర్వంగా చెప్పుకోవడం విశేషం. దశాబ్దాలు గడుస్తున్నా సరే అభిమానులలో అదే రకమైన ఉత్సాహం, అభిమానం కొనసాగడం ఒక్క మెగాస్టార్‌కే చెల్లిందని చెప్పవచ్చు.
మొత్తానికి చిరంజీవి ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆకాంక్షిస్తూ ``మీరెప్పుడూ బాగుండాలి`` అంటూ అభిమానులు ఆశీస్సులు అందిస్తున్నారు. పుట్టినరోజుకు ముందే డిజిటల్ వేదికలపై మొదలైన ఈ `మెగా` వేడుకలు.. మునుముందు రోజుల్లో సోషల్ మీడియాలో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా మెగా బర్త్ డే పార్టీలో ఒక అభిమాని మాట్లాడుతూ .. అన్నయ్యకు భారతరత్న రావాలి అని ఆకాంక్షించారు.
