ఒకే రోజు లాంచ్.. రిలీజ్ క్లాష్ కూడా తప్పదా?
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లాంచింగ్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. పూజా కార్యక్రమాలు, టైటిల్ పోస్టర్లతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
By: M Prashanth | 20 May 2026 4:00 AM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లాంచింగ్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. పూజా కార్యక్రమాలు, టైటిల్ పోస్టర్లతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ తమ కొత్త సినిమాలను ఒకే రోజు ప్రారంభించనుండటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో మెగా, నందమూరి అభిమానుల సందడి మొదలైంది. అయితే ఆ లాంచ్ హడావుడి మధ్య మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ఆ సినిమాలు రిలీజ్ విషయంలో కూడా క్లాష్ ఉంటుందా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
మే 21వ తేదీన టాలీవుడ్ కు మాస్ ఫీస్ట్ లా మారబోతోంది. బాలకృష్ణ తన కొత్త చిత్రం NBK112ను ఆ రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఎ మూవ్మెంట్ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ తో ప్రకటించిన ఆ సినిమా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టే మాస్ యాక్షన్, సోషల్ మెసేజ్ కలయికగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడనే వార్త కూడా సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. బాలయ్య-కొరటాల కాంబినేషన్ తొలిసారి కుదరడంతో ఆ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సినిమా వచ్చే సంక్రాంతి రేసులో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 158 కూడా మే 21నే స్టార్ట్ కానుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారని సమాచారం. 70 ఏళ్ల వయసులో కొత్త లుక్ కోసం ఆయన చూపిస్తున్న డెడికేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
బాబీ మార్క్ ఎమోషన్స్, చిరంజీవి మాస్ ఇమేజ్ కలిస్తే మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కూడా వచ్చే సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకే ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేస్తే భారీ క్లాష్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సంక్రాంతి ఛాన్స్ ఎవరూ మిస్ చేసుకునే ఆలోచనలో ఉండరు.
అయితే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ దసరాకే విడుదలైతే కొరటాల శివ ప్రాజెక్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం ఆ రెండు సినిమాల లాంచ్ లే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఒకే రోజు ప్రారంభమవుతున్న ఆ ప్రాజెక్టులు భవిష్యత్తులో బాక్సాఫీస్ ఫైట్ కు దారి తీస్తాయా? లేక రిలీజ్ డేట్లు మారుతాయా? అన్నది చూడాలి.
