ఫ్యాన్స్ డిబేట్: చిరు- బాలయ్య కాంబినేషన్ సాధ్యమేనా?
మలయాళ చిత్ర సీమ లెజెండ్స్ మోహన్ లాల్- మమ్ముట్టి ఎల్లపుడూ కలిసి పని చేసేందుకు భేషజానికి పోలేదు. ఆ ఇద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి.
By: Sivaji Kontham | 3 Oct 2025 5:00 AM ISTమలయాళ చిత్ర సీమ లెజెండ్స్ మోహన్ లాల్- మమ్ముట్టి ఎల్లపుడూ కలిసి పని చేసేందుకు భేషజానికి పోలేదు. ఆ ఇద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. అభిమానులు ఎక్కువ తక్కువ అనే భావజాలానికి దూరంగా ఉన్నారు గనుకనే ఇది సాధ్యమైంది. మా హీరోనే గొప్ప అనే ఫీలింగ్ ని మించి పరిణతి అభిమానుల్లో ఉంది ఇక్కడ. హీరోల మధ్య ఈగోలకు తావే లేదు కాబట్టి ప్రతిదీ సాధ్యమే. కానీ టాలీవుడ్, కోలీవుడ్ లో ఇలాంటివి సాధ్యపడదు.
తమిళంలో విజయ్- అజిత్ కలిసి నటించే సినిమా చూడలేం. ఆ ఇరువురు అభిమానుల నడుమా ఘర్షణ వాతావరణం, ఈగో సమస్యల కారణంగా అలాంటి సాహసానికి ఏ దర్శకరచయితా ప్రయత్నించలేని పరిస్థితి ఉంది. అయితే రజనీకాంత్- కమల్ హాసన్ లాంటి గొప్ప స్నేహితుల మధ్య ఇది సాధ్యం కావొచ్చు. ఇరువురి రాజకీయ పార్టీలు వేరు అయినా, రాజకీయంగా అభిప్రాయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఆ ఇద్దరూ కలిసి పని చేయగలరు. ఆ ఇద్దరూ కలిసి నటించాలని చాలా కాలంగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇటీవల తాము కలిసి పని చేస్తామని ఆ ఇద్దరూ ధృవీకరించడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.
టాలీవుడ్ లో చిరంజీవి- బాలకృష్ణ లేదా బాలకృష్ణ- నాగార్జున కలయిక సాధ్యమవుతుందా? భేషజాలకు పోకుండా ఇరువురు సీనియర్ హీరోలు కలిసి పని చేయగలరా? అంటే దీనికి సమాధానం అభిమానులకు స్పష్ఠంగా తెలుసు. ఫ్యాన్స్ మధ్య తీవ్ర వైషమ్యాలు, విభేధాల కారణంగా అలాంటి ఒక స్క్రిప్టును రచించడం దర్శకరచయితలకు సాధ్యపడుతుందా అన్నది సందేహమే. దీనికి హీరోలే ఏదో ఒక రోజు క్లారిటీ కంటే క్లియరెన్స్ ఇస్తే బావుంటుంది.
భవిష్యత్ లో చిరంజీవి- నాగార్జున లేదా చిరంజీవి - వెంకటేష్ లేదా చిరంజీవి-నాగార్జున- వెంకటేష్ కాంబినేషన్ లో సినిమాలు వచ్చేందుకు ఆస్కారం లేకపోలేదు. వారి మధ్య మంచి సమీకరణం పని చేస్తోంది కాబట్టి ఇది సాధ్యమని నమ్ముతున్నారు. చిరంజీవి- పవన్ కల్యాణ్ నటించే సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అయితే దర్శకరచయితలు ఇలాంటి సాహసం ఇప్పటివరకూ చేయలేదు. నాగార్జున- వెంకటేష్ గతంలో కలిసి పని చేసారు కానీ, ఆ ఇద్దరూ చిరంజీవితో కలిసి పని చేసే సినిమా కోసం అభిమానులు ఆసక్తిని కలిగి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అగ్ర హీరోలు కలిసి పని చేస్తే ఇండస్ట్రీలో వాతావరణం బిగుతుగా లేకుండా, తేలికవుతుందని కూడా భావిస్తున్నారు.
రాజమౌళి చొరవతో ఆర్.ఆర్.ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి పని చేసారు. ఆ ఇద్దరూ మంచి స్నేహితులు కావడం రాజమౌళికి కలిసొచ్చింది. నేటితరం స్టార్లలో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ కలిసి పని చేసేందుకు ఆస్కారం ఉంది. మహేష్, పవన్ కల్యాణ్ మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తారు కాబట్టి ఈ కలయిక సాధ్యపడుతుందనే ఆశిద్దాం. ఇక జెన్ జెడ్ స్టార్లు భేషజాలకు పోకుండా కలిసి పని చేస్తే పాన్ ఇండియాలో సత్తా చాటడం సాధ్యపడుతుంది. మోహన్ లాల్ - మమ్ముట్టి లాంటి స్టార్లను అన్ని పరిశ్రమల్లో అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.
