Begin typing your search above and press return to search.

AMB- AAA ల‌ను మించేలా కాదు.. వ‌ర‌ల్డ్ నం.1గా మెగా ఐమ్యాక్స్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ కొలతలు, ప్రత్యేకమైన ఫార్మాట్లతో ప్రసిద్ధి చెందిన టాప్-5 అతిపెద్ద ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌లు ఎక్క‌డ ఉన్నాయో ప‌రిశీలిస్తే..

By:  Sivaji Kontham   |   20 Sept 2026 11:15 AM IST
AMB- AAA ల‌ను మించేలా కాదు.. వ‌ర‌ల్డ్ నం.1గా మెగా ఐమ్యాక్స్!
X

హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమ్యాక్స్ వైదొలిగాక ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇప్పటికే కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. జర్మనీ, అమెరికా లాంటి విదేశాల్లో అత్యంత భారీతనం నిండిన ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉండగా, అల్లు అర్జున్ వంటి నటులు ఆ దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కూడా అడుగుపెడుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మెగా కాంపౌండ్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఐమ్యాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారం హోరెత్తుతోంది.

తెలంగాణలో ప్రముఖ రిటైల్ ఫిల్మ్ ఎగ్జిబిటర్ అయిన ఏషియన్ సినిమాస్ ఇప్పటికే మహేశ్‌బాబుతో ఏఎంబీ (AMB), అల్లు అర్జున్‌తో ఏఏఏ (AAA), రవితేజతో ఏఆర్‌టి (ART), విజయ్ దేవరకొండతో ఏవీడీ (AVD) వంటి సక్సెస్‌ఫుల్ మల్టీప్లెక్సులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే సంస్థ సునీల్ నారంగ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవితో ఈ సరికొత్త `మెగా ప్రాజెక్టు`ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఏ మల్టీప్లెక్స్ ప్రాజెక్టులకైనా దీన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలిపేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

హైదరాబాద్‌ను `సినిమా క్యాపిటల్ ఆఫ్ ఇండియా`గా నిలబెట్టేలా ఏషియన్ సినిమాస్, మెగాస్టార్ చిరంజీవి ఈ భారీ కలయికతో ముందుకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ ప్రీమియం ప్రాపర్టీలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ప్రేక్షకులకు ఎప్పటికీ మరువలేని థ్రిల్లింగ్, చిల్లింగ్ మూవీ-వాచింగ్ అనుభూతిని పంచే ఈ ప్రాజెక్ట్‌కు ఏషియన్ చిరంజీవి సినిమాస్ (ACC) లేదా ఏషియన్ మెగాస్టార్ సినిమాస్ (AMC) అనే పేరు పెట్టే అవకాశం ఉంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం జర్మనీలోని ట్రిగ్‌పలాస్ట్ లియోన్‌బెర్గ్‌లో ఉన్న స్క్రీన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉండగా, అమెరికాలోని జార్జియాలో కూడా మరో భారీ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ - చిరంజీవి కలయికలో నిర్మించ‌నున్న‌ ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయికి పోటీగా.. బహుశా వాటిని మించే కొలతలతో రూపుదిద్దుకుంటుందనే అంచనాలున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

ప్ర‌పంచంలోనే టాప్ -5 అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ లు ఎక్క‌డ ఉన్నాయి?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ కొలతలు, ప్రత్యేకమైన ఫార్మాట్లతో ప్రసిద్ధి చెందిన టాప్-5 అతిపెద్ద ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌లు ఎక్క‌డ ఉన్నాయో ప‌రిశీలిస్తే..

1. ట్రౌమ్‌పలాస్ట్ లియోన్‌బెర్గ్ - లియోన్‌బెర్గ్, జర్మనీ

ప్రపంచంలోనే అత్యంత పెద్ద పర్మినెంట్ సినిమా స్క్రీన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. దీని కొలతలు సుమారు 127.3 అడుగుల వెడల్పు, 68.9 అడుగుల ఎత్తు (మొత్తం విస్తీర్ణం దాదాపు 814.8 చదరపు మీటర్లు) కలిగి ఉంది.

2. ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ - మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మ్యూజియంలో ఉన్న ఈ స్క్రీన్ ప్రపంచంలోని అత్యుత్తమ లార్జ్-ఫార్మాట్ స్క్రీన్‌లలో ఒకటి. ఇది 1.43:1 యాస్పెక్ట్ రేషియోతో 105 అడుగుల వెడల్పు, 75.5 అడుగుల ఎత్తు కలిగి ఉండి.. అసలుసలైన 15/70ఎంఎం ఫిల్మ్ ప్రొజెక్షన్‌కు ప్రసిద్ధి చెందింది.

3. రాయ్ సినిమాస్ ఐమ్యాక్స్ - పూలర్, జార్జియా, అమెరికా

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న ఈ థియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐమ్యాక్స్ స్క్రీన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఇది 101 అడుగుల వెడల్పు, 76.2 అడుగుల ఎత్తుతో దాదాపు 7,696 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది.

4. ఏఎంసీలింకన్ స్క్వేర్ ఐమ్యాక్స్ - న్యూయార్క్, అమెరికా

హాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఎక్కువగా ప్రీమియర్స్- స్పెషల్ స్క్రీనింగ్‌ల కోసం ఎంచుకునే పాపుల‌ర్ ఐమ్యాక్స్ థియేటర్ ఇది. దీని స్క్రీన్ సుమారు 97 అడుగుల వెడల్పు, 76 అడుగుల ఎత్తుతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

5. బీఎఫ్ఐ ఐమ్యాక్స్ - లండన్, యునైటెడ్ కింగ్‌డమ్

యూకేలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌లలో ఇదొకటి. భారీ జనసమూహం ... అద్భుతమైన ఆడియో-విజువల్ అనుభవానికి ఇది చాలా పేరుగాంచింది.

హైద‌రాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి నిర్మించే ఐమ్యాక్స్ థియేట‌ర్ వీట‌న్నిటినీ మించేలా ఉంటుంద‌నే చ‌ర్చ హైద‌రాబాదీల‌కే కాదు మొత్తం దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిల‌వ‌నుంది.