చిరు-అనిల్ ఆ మార్క్ టచ్ చేయగలరా...?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 25 Oct 2025 10:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. 2026 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఇటీవల విడుదల అయిన చిరంజీవి, నయనతారల కాంబో పాట మీసాల పిల్ల పాట సోషల్ మీడియాలోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారు, ముసలి వారి వరకు మీసాల పిల్ల అంటూ స్టెప్స్ వేయడంతో వైరల్‌గా మారింది. ఈ పాట సినిమా స్థాయిని అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు. మొదట పాటకు ట్రోల్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు వైరల్ సాంగ్‌గా మారింది. ముందు ముందు రాబోతున్న ప్రమోషనల్ స్టఫ్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెంచే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ...
అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా రికార్డ్‌ను నమోదు చేసిన విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండా ఒకే భాషలో విడుదల అయ్యి ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమాగా సౌత్ ఇండియాలోనే టాప్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఇప్పుడు చిరు-అనిల్ ఆ మార్క్‌ను క్రాస్ చేస్తారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి మాస్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తే ఎలా ఉంటాయో గతంలో వచ్చిన వసూళ్లు సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. కనుక మంచి ఎంటర్‌టైన్మెంట్ పడితే ఖచ్చితంగా మన శంకరవర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూళ్లను బీట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు అనేది మెగా ఫ్యాన్స్ మాట.
మన శంకరవర ప్రసాద్ గారు సినిమా..
థియేటర్ల వద్ద ఒకప్పటిలా పరిస్థితి లేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు మూడు వారాల్లో వసూళ్లు రాబట్టుకోవాల్సి ఉంది. అంటే అందుకు తగ్గట్లుగా ఓపెనింగ్స్ రావాల్సి ఉంది. అలా ఓపెనింగ్స్ రావాలంటే సినిమాను అంతకు మించి అన్నట్లుగా ప్రచారం చేయాలి, సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూడాలి. అలా సినిమాపై ఆసక్తి అంచనాలు పెంచితేనే భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతాయి. ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి, అంతే కాకుండా ఈయన ప్రమోషన్స్ చాలా విభిన్నంగా చేస్తాడు. కనుక మన శంకరవర ప్రసాద్ గారు విడుదల సమయంలో హడావిడి మామూలుగా ఉండదు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా ఉండటం వల్ల సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు.
సంక్రాంతి 2026 విజేత ఎవరు..
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, ఇటీవలే వెంకటేష్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు అంటూ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. సినిమా సంక్రాంతి 2026 కి విడుదల కావడం నూటికి నూరు శాతం పక్కా. అదే సమయంలో పలు సినిమాలు ఉన్నప్పటికీ చిరంజీవి రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే అని మెగా ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినీ విశ్లేషకులు సైతం మన శంకరవర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నాం టచ్ చేసిన రూ.300 కోట్ల క్లబ్‌ను క్రాస్ చేసి రూ.400 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి రూ.400 కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తే ఖచ్చితంగా అది అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయంగా నమోదు కానుంది. చిరంజీవి స్టామినా, అనిల్ ప్రస్తుతం ఉన్న ఫామ్ నేపథ్యంలో రూ.400 కోట్లు కష్టం కాకపోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. మరి సినిమా ఫలితం ఏంటి అనేది తెలియాలంటే 2026 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.
