Begin typing your search above and press return to search.

అన్న‌య్య క్లాస్ త‌మ్ముళ్లు సీరియ‌స్ గా తీసుకుంటే మంచిదే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరితో ఆప్యాయంగా ఉంటూ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా యువ నటులకు, టెక్నీషియన్లకు, ద‌ర్శ‌కుల‌కు కొన్ని విలువైన స‌ల‌హాలు ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   12 Aug 2026 5:17 PM IST
అన్న‌య్య క్లాస్ త‌మ్ముళ్లు సీరియ‌స్ గా తీసుకుంటే మంచిదే!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరితో ఆప్యాయంగా ఉంటూ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా యువ నటులకు, టెక్నీషియన్లకు, ద‌ర్శ‌కుల‌కు కొన్ని విలువైన స‌ల‌హాలు ఇచ్చారు. సినిమా నిర్మాణ రంగంలో రోజురోజుకు మారుతున్న పోకడలపై, పెరుగుతున్న బడ్జెట్లపై చిరజీవి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఆలోచించదగ్గవిగా ఉన్నాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్, క్రేజ్ సరిపోవని మరోసారి స్పష్టం చేశారు. ఏ సినిమాకైనా బడ్జెట్ కంటే బలమైన కథాంశం , సరైన ప్లానింగ్ అత్యంత ముఖ్యమని హితవు పలికారు.

కేవలం భారీ ఖర్చులతో గ్రాండియర్‌గా తీస్తే సరిపోదని ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ ఉన్నప్పుడే సినిమా విజయం సాధిస్తుందని గుర్తుచేశారు. అలాగే సినిమాను నిర్మించే నిర్మాతల పట్ల ప్రతి ఒక్కరూ భయం, భక్తి కలిగి ఉండాలని సూచించారు. నిర్మాత లేకపోతే ఇండస్ట్రీ లేదని, వారి పెట్టుబడిని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. కొందరు చిన్న సినిమాలు థియేటర్లకు రావడం లేదని, పెద్ద సినిమాల తాకిడి వల్ల తమ చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని నిత్యం ఫిర్యాదు చేస్తుంటారు.

ఈ అంశంపై స్పందిస్తూ ఇతరులను తప్పుపట్టడం మానేసి ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చిరంజీవి స్పష్టం చేశారు. కంటెంట్‌లో దమ్ముంటే చిన్న సినిమా? పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని గతంలో ఎన్నో చిత్రాలు ఈ నిజాన్ని నిరూపించాయన్నారు. నిజంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటే దానిని థియేటర్లలో విడుదల చేయడానికి ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ముందుకొస్తారని భరోసా ఇచ్చారు. సినిమాను నమ్మేవాళ్లను, కష్టపడేవాళ్లను ఇండస్ట్రీ ఎప్పుడూ మోసం చేయదని కాబట్టి అనవసరమైన హంగు ఆర్భాటాల కంటే బలమైన స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడంపైనే యువ దర్శకులు, హీరోలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సలహాను టాలీవుడ్‌లోని యంగ్ జనరేషన్ తమ్ముళ్లు అందరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పెరుగుతున్న బడ్జెట్లు , తప్పుదారి పడుతున్న ప్లానింగ్ వల్ల ఇటీవల కాలంలో ఎన్నో చిన్న, మధ్యతరహా సినిమాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల అనుభవం ఉన్న చిరంజీవి లాంటి దిగ్గజ నటుడు స్వయంగా ఈ విషయాలను ప్రస్తావించడం ఇండస్ట్రీకి మంచి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. నిర్మాతల శ్రేయస్సును కాపాడుకుంటూ బాధ్యతతో ముందుకు వెళ్తేనే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుందని అన్న‌య్య‌ చాటి చెప్పిన విధానం అభినందనీయం.