బట్టలు కారణం కాదు, ఆ మైండ్ సెట్ మారాలి.. చిన్మయి కౌంటర్!
శివాజీ ప్రస్తావించిన నటి సౌందర్య గారి గురించి కూడా చిన్మయి మాట్లాడారు. సౌందర్య గారు తనకు ఎంతో ఇష్టమైన నటి అని, ఆమె ఎప్పుడూ పద్ధతిగానే ఉండేవారని అన్నారు.
By: M Prashanth | 25 Dec 2025 12:07 AM ISTశివాజీ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా స్పందిస్తూ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె వస్త్రధారణే ఆకృత్యాలకు కారణం అనే వాదనను చాలా బలంగా తిప్పికొట్టారు. ఉదాహరణకు కేరళలో మహిళలు చాలా పద్ధతిగా చీర కట్టుకుని, నగలు వేసుకుని ఉంటారని, అయినా అక్కడ ఒక బస్సులో చీర కట్టుకున్న మహిళ పట్ల ఒక వ్యక్తి ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో చూపిస్తూ ఒక వీడియో క్లిప్ ను ఆమె షేర్ చేశారు.
చాలా సందర్భాల్లో మహిళలు బయట వ్యక్తుల కంటే సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని చిన్మయి గుర్తుచేశారు. తండ్రి, అన్న, తమ్ముడు, మామ, బావ, స్నేహితులు ఇలా తెలిసిన వాళ్ళే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు, తెలిసిన వాళ్ళ మధ్య ఉన్నప్పుడు బట్టల ప్రస్తావన ఎందుకు వస్తుందని, అక్కడ వాళ్లు పద్ధతిగానే ఉంటారు కదా అని ఆమె ప్రశ్నించారు.
శివాజీ ప్రస్తావించిన నటి సౌందర్య గారి గురించి కూడా చిన్మయి మాట్లాడారు. సౌందర్య గారు తనకు ఎంతో ఇష్టమైన నటి అని, ఆమె ఎప్పుడూ పద్ధతిగానే ఉండేవారని అన్నారు. కానీ ఈ మధ్య ఏఐ టెక్నాలజీ వాడి సౌందర్య గారి ఫోటోలను కూడా అసభ్యంగా మార్ఫింగ్ చేశారని గుర్తుచేశారు. చనిపోయిన వారిని, పద్ధతిగా ఉన్నవారిని కూడా ఈ సమాజం వదలడం లేదని, దానికి కారణం బట్టలు కాదని, మనుషుల వక్రబుద్ధి అని ఆమె స్పష్టం చేశారు.
తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని కూడా చిన్మయి ఈ సందర్భంగా బయటపెట్టారు. తాను చున్నీ వేసుకుని, ఒంటి నిండా బట్టలు వేసుకున్నప్పుడే తనను ఒకరు ఇబ్బంది పెట్టారని చెప్పారు. కాబట్టి బట్టలు అనేవి ఇక్కడ సమస్య కాదని, రేప్ చేసేవాడి మైండ్ సెట్ మాత్రమే సమస్య అని ఆమె తేల్చి చెప్పారు. ఇలా బట్టల మీద నెపం నెట్టే వారిని ఆమె 'రేప్ అపాలజిస్ట్' అని తీవ్రంగా విమర్శించారు.
మగవాళ్ళు చేసే తప్పులకు ఆడవాళ్ళ బట్టలను సాకుగా చూపించడం సరికాదని చిన్మయి హితవు పలికారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు, అబ్బాయిలు కూడా మగవాళ్ళ చేతిలో లైంగిక దాడులకు గురవుతున్నారని, మరి అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా అని ఆమె నిలదీశారు. తన కొడుకును మాత్రం ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ను గౌరవించేలా పెంచుతానని చెప్పారు.
చివరగా రేప్ జరగడానికి ఏకైక కారణం రేపిస్ట్ మాత్రమే అని, అబ్యూస్ జరగడానికి కారణం అబ్యూజర్ మాత్రమే అని చిన్మయి క్లారిటీ ఇచ్చారు. బాధితులను నిందించడం ఆపేయాలని, మన సంస్కృతి పేరు చెప్పి ఇలాంటి చర్యలను సమర్ధించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
