Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్ ఫోటోలు.. ఒక్క క్లిక్ తో అలా డిలీట్ చేయొచ్చు..

మరోవైపు హీరోయిన్ రష్మిక మందన్నను మొదలుకొని సింగర్ చిన్మయి వరకు ఎంతోమంది డీప్ ఫేక్ పేరిట ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే.

By:  Madhu Reddy   |   3 Jan 2026 3:32 PM IST
డీప్ ఫేక్ ఫోటోలు.. ఒక్క క్లిక్ తో అలా డిలీట్ చేయొచ్చు..
X

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు మంచి కోసం రూపొందించబడే ఈ టెక్నాలజీనీ కొంతమంది తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మనిషి సమయాన్ని ఆదా చేస్తూ.. సగటు మనిషికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వేగవంతమైన టెక్నాలజీగా పేరు దక్కించుకున్న ఈ ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పిలవబడే ఈ టెక్నాలజీ ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే అలాంటి ఈ టెక్నాలజీని కొంతమంది సద్వినియోగం చేసుకోకుండా తప్పుడు మార్గంలో ఉపయోగిస్తూ ఎంతోమందికి ఇబ్బందులు కలగజేస్తున్నారు.

ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలను, వీడియోలను క్రియేట్ చేస్తూ సెలబ్రిటీల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అయితే ఈ విషయంపై కొంతమంది ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు. ఐశ్వర్యరాయ్ మొదలుకొని అభిషేక్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అనిల్ కపూర్ ఇలా ఎంతోమంది.. తమ ఫోటోలను దుర్వినియోగం చేయడమే కాకుండా అసభ్యకరంగా సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మరోవైపు హీరోయిన్ రష్మిక మందన్నను మొదలుకొని సింగర్ చిన్మయి వరకు ఎంతోమంది డీప్ ఫేక్ పేరిట ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. అసభ్యకరంగా వీరి ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలి వారి గౌరవానికి భంగం కలిగించారు. అయితే వీరంతా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు.

అలా గత కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ వేధింపుల విషయంలో తనదైన స్టైల్ లో.స్పందించిన ప్రముఖ సింగర్ చిన్మయి.. ఇప్పుడు మరొకసారి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ శిక్ష తప్పదు అంటూ హెచ్చరించింది. అంతేకాదు ఇలాంటి డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైతే వాటిని ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్పుకొచ్చింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా.. ఎవరైనా ఒకవేళ మీ ఫోటోని ఏఐ లేదా ఫోటోషాప్ తో ఎడిట్ చేసి అసభ్యకరంగా సృష్టిస్తే.. stopncii.org వెబ్ సైట్ కి వెళ్లి అసలైన ఫోటోతో పాటు ఎడిట్ చేసిన ఫోటోని సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇస్తే వెంటనే వారు దానిని తొలగిస్తారు. ఒకవేళ మీరు మైనర్ అయితే iwf.org.uk/report/ లేదా takeitdown.ncmec.org వెబ్సైట్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ ఫోటోలను లేదా వీడియోలను డిలీట్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం చిన్మయి ఇచ్చిన ఈ వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇకపై మీ ఫోటోలను, వీడియోలను ఎవరైనా సరే ఉపయోగించి అసభ్యకరంగా సృష్టిస్తే మాత్రం వెంటనే ఈ వెబ్సైట్లో ఆ ఫోటోలను సబ్మిట్ చేసి డిలీట్ చేయించుకోవచ్చని భారీ ఊరట కలిగించింది చిన్మయి.