'రెండింటిలో ఏదో ఒకటి చేయండి'.. సింగర్ చిన్మయికి డైరెక్టర్ రిక్వెస్ట్
సింగర్ చిన్మయి.. రీసెంట్ గా ఓ సాంగ్ ను పాడినందుకు సోషల్ మీడియాలో సారీ చెప్పిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 3 Dec 2025 8:17 PM ISTసింగర్ చిన్మయి.. రీసెంట్ గా ఓ సాంగ్ ను పాడినందుకు సోషల్ మీడియాలో సారీ చెప్పిన విషయం తెలిసిందే. రిచర్డ్ రిషి, రక్షణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ద్రౌపది-2 మూవీలోని ఎమ్కోనీ పాటను చిన్మయ ఆలపించారు. మోహన్ జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ద్రౌపది-2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రీసెంట్ గా మేకర్స్ సినిమా నుంచి ఎమ్కోనీ సాంగ్ ను విడుదల చేశారు. రిలీజ్ అయిన కొద్దిసేపటికే సారీ చెబుతూ చిన్మయి పోస్ట్ పెట్టారు. రికార్డింగ్ సమయంలో సినిమా సైద్ధాంతిక నేపథ్యం గురించి తనకు తెలియదని చెప్పారు. తెలిసి ఉంటే తాను పాటను పాడేదాన్ని కాదని తెలిపారు.
సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఆ పరిచయంతో వెళ్లి సాంగ్ పాడానని, మోహన్ జి సినిమా అని తనకు తెలియదని చిన్మయి అన్నారు. సాంగ్ మ్యూజిక్ కోసం జిబ్రాన్ ఐడియా ఇచ్చారని, తాను పాట రికార్డింగ్ పూర్తి చేసి వెళ్లిపోయానని తెలిపారు. డైరెక్టర్ మోహన్ భావజాలం, సిద్ధాంతాలు తన సిద్ధాంతాలకు పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయని రాసుకొచ్చారు.
అయితే చిన్మయి ట్వీట్ పై మోహన్ జి ఇప్పుడు మరోసారి స్పందించారు. సాంగ్ కోసం తానే చిన్మయిని సెలెక్ట్ చేశానని, రికార్డింగ్ సెషన్ లో మ్యూజిక్ డైరెక్టర్ లేరని తెలిపారు. చిన్మయికి సాంగ్ కోసమే తెలుసని, సైద్ధాంతిక వివరాలు డిస్కస్ చేయలేదని చెప్పారు. ఎలాంటి వివరణ కోరకుండా చిన్మయి ప్రకటన చేయడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.
అందుకే ఆమె వ్యాఖ్యలను స్పష్టం చేయాలని లేదా ట్వీట్ ను తొలగించాలని చిన్మయిని కోరారు. అంతకుముందు.. సినిమాలోని ఇతర నటీనటులు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవద్దని మోహన్ జి సినీ ప్రియులను కోరారు. విమర్శలు తనపై మాత్రమే ఉండాలని నొక్కి చెప్పారు. తన మూవీ టీమ్ లోని వారిని లక్ష్యంగా చేసుకోవడం పిరికితనం అని ఆయన అన్నారు.
అయితే విరుద్ధమైన భావజాలాల గురించి చిన్మయిని ప్రస్తావించడాన్ని ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ మోహన్. జి. ఆమె ఇంటి పేరు శ్రీపాద అనేది విశ్వాసంతో సంబంధాన్ని సూచిస్తుందని తెలిపారు. అందుకే ఆమె ప్రస్తావిస్తున్న సైద్ధాంతిక తేడాల గురించి తనకు స్పష్టత రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని లేదా ట్వీట్ తొలగించాలని కోరారు.
