Begin typing your search above and press return to search.

బుల్లిరాజు ముందున్న అస‌లైన స‌వాల్ అదే!

ఒకప్పుడు సినిమా స‌క్సెస్ లో చైల్డ్ ఆర్టిస్టుల పాత్ర కథకు పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 Jun 2026 7:00 AM IST
బుల్లిరాజు ముందున్న అస‌లైన స‌వాల్ అదే!
X

ఒకప్పుడు సినిమా స‌క్సెస్ లో చైల్డ్ ఆర్టిస్టుల పాత్ర కథకు పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే నటన కనబరిస్తే చిన్నారులు కూడా హీరోలు, హీరోయిన్ల తరహాలోనే మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నారనే సంకేతాలు టాలీవుడ్‌లో కనిపిస్తున్నాయి. ఇటీవల సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో తన నేచుర‌ల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బుల్లిరాజు అలియాస్ రేవంత్‌కు వస్తున్న అవకాశాలే దీనికి తాజా ఉదాహరణగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అతడిని కేవలం సినిమాల కోసమే కాకుండా టెలివిజన్ కార్యక్రమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్, షోరూమ్ ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాలకు కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు నిర్మాతలకు, బ్రాండ్లకు కమర్షియల్‌గా ఉపయోగపడే ముఖాలుగా మారుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఈ మార్పును మరింత వేగవంతం చేసింది. ఒక పాత్ర ప్రేక్షకుల్లో వైరల్ అయితే, ఆ ఆర్టిస్ట్ గుర్తింపు కొన్ని రోజుల్లోనే భారీ స్థాయికి చేరుతోంది.

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టుల కాల్‌షీట్లను కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. వారి చదువు, వ‌ర్క్ అవ‌ర్స్ లిమిట్స్ ను దృష్టిలో పెట్టుకుని వారి సీన్స్ ను ముందుగానే షెడ్యూల్ చేసి తక్కువ టౌమ్ లో తెర‌కెక్కించేలా డైరెక్ట‌ర్లు, నిర్మాణ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో వారి రెమ్యూన‌రేష‌న్ కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే చిన్న వయసులో వచ్చే అపారమైన గుర్తింపు ఎంత వేగంగా వస్తుందో, దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమనే విషయం గతంలో పలువురు చైల్డ్ ఆర్టిస్టుల కెరీర్లు నిరూపించాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత వయసు పెరిగే కొద్దీ అదే స్థాయి అవకాశాలు దక్కక కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఉదాహరణలు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో చాలానే ఉన్నాయి. అందుకే ప్రారంభ విజయాన్ని మాత్రమే కాకుండా ఫ్యూచ‌ర్ ప్లానింగ్ ను కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, బుల్లిరాజుకు ఇప్పటికే వెంక‌టేష్- క‌ళ్యాణ్ రామ్ రూపంలో మరో పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం ద‌క్కిన‌ట్టు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా అతడిని తీసుకోవాలనే ఆసక్తిని పలువురు దర్శకులు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వరుస అవకాశాలు, పెరుగుతున్న బ్రాండ్ విలువ, కమర్షియల్ డిమాండ్ అన్నీ కలిసి ప్రస్తుతం అతడిని టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చైల్డ్ ఆర్టిస్టులలో ఒకరిగా నిలబెట్టాయి. అయితే ఈ క్రేజ్‌ను దీర్ఘకాలిక కెరీర్‌గా మలచుకోవడమే ఇప్పుడు అతడి ముందున్న అసలు సవాల్ అని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.