పెద్ది సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది?
రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏ.ఆర్. రెహమాన్.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (RC16)పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
By: M Prashanth | 8 Nov 2025 2:42 PM ISTరామ్ చరణ్, బుచ్చిబాబు, ఏ.ఆర్. రెహమాన్.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (RC16)పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ అంచనాల మధ్య, సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ "చికిరి చికిరి" విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. 24 గంటలు గడిచేసరికి, ఈ పాటకు సంబంధించిన గణాంకాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మొదటి 24 గంటల్లో ఈ పాట యూట్యూబ్‌లో ఆకట్టుకునే నంబర్లను నమోదు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట 29.19 మిలియన్ వ్యూస్‌ను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది సౌత్ ఇండియా సినిమా పాటల పరంగా ఒక బలమైన ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూస్ ద్వారా 'పెద్ది' సినిమాకు ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
వ్యూస్ మాత్రమే కాదు, లైక్స్ పరంగా కూడా ఈ పాట గట్టిగానే రిజిస్టర్ అయింది. మొదటి 24 గంటల్లోనే "చికిరి చికిరి" సాంగ్ 676.4K (6.7 లక్షలకు పైగా) లైక్స్‌ను దక్కించుకుంది. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) చరిత్రలో టాప్ 4వ స్థానం కావడం గమనార్హం.
ఈ రేంజ్ నంబర్లకు ప్రధాన కారణం రామ్ చరణ్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కొత్త రగ్గడ్ లుక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ విజువల్‌గా పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చాలా కాలం తర్వాత చరణ్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్స్ మూమెంట్స్ దొరకడంతో, విజువల్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
అయితే, ఆడియో పరంగా ఇది మిక్స్ డ్ టాక్ ని అందుకుంటోంది. ఇది ఏ.ఆర్. రెహమాన్ మార్క్ సాంగ్ అని, విన్న వెంటనే కాకుండా, వినగా వినగా ఎక్కే (స్లో పాయిజన్) మెలోడీ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మోహిత్ చౌహాన్ సాఫ్ట్ వాయిస్‌ను ఇలాంటి పక్కా రూరల్ పాటకు వాడటం ఒక కొత్త ప్రయోగం.
మొత్తంగా చూస్తే, "చికిరి చికిరి" ఆడియో ఒక ప్రయోగంలా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్.. ఆ ప్రయోగాన్ని కూడా సక్సెస్ వైపు నడిపించాయి. ఆడియో విజువల్స్ కలిసి పాటను పెద్ద హిట్ చేశాయి. 2026లో రానున్న సినిమాకు ఈ ఫస్ట్ సింగిల్ ఒక సాలిడ్ బేస్‌మెంట్ వేసిందని చెప్పొచ్చు.
