Begin typing your search above and press return to search.

కిరణ్ లవ్ స్టోరీకి 'బేబీ' కలిసి వచ్చినట్లుందే.. మరి రిజల్ట్?

సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి దాదాపు రూ.30 కోట్లకుపైగా అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది.

By:  M Prashanth   |   13 July 2026 12:26 PM IST
కిరణ్ లవ్ స్టోరీకి బేబీ కలిసి వచ్చినట్లుందే.. మరి రిజల్ట్?
X

ఒక సినిమా హిట్ అయితే దర్శకుడు, హీరోకే కాదు.. నిర్మాతల బ్రాండ్ వాల్యూ కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఆ విజయమే తర్వాతి సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సంచలన విజయాన్ని అందుకున్న బేబీ సినిమా క్రియేట్ చేసిన గుడ్‌ విల్ ఇప్పుడు ఆ మూవీకి బిజినెస్ పరంగా బాగా ఉపయోగపడిందనే చర్చ జరుగుతోంది.

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఆ చిత్రాన్ని ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఆ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టీజర్‌ కు వచ్చిన రెస్పాన్స్, మణిశర్మ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమాకు ఎక్స్ ట్రా అసెట్స్ గా మారాయి. దీనికి తోడు నిర్మాతల గత విజయాల ఎఫెక్ట్ కూడా బిజినెస్‌ పై స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది.

సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి దాదాపు రూ.30 కోట్లకుపైగా అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌ ను చూస్తే ఇది మంచి బిజినెస్‌ గా భావించాలి. ముఖ్యంగా ఆడియో హక్కులకు కూడా మంచి డీల్ కుదిరినట్లు సమాచారం. మిడ్ రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషం. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి బేబీ సినిమా సాధించిన ఘనవిజయమేనని టాక్ వినిపిస్తోంది.

కొన్నేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించింది. నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లలో నమ్మకం పెరగడానికి అదే కారణమైంది. ఇప్పుడు అదే బ్రాండ్ ఇమేజ్ చెన్నై లవ్ స్టోరీ బిజినెస్‌కు కూడా తోడైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల థియేట్రికల్ హక్కులు విక్రయమవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ డీల్స్ పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్ లో కూడా విడుదలకు మంచి ప్లాన్లు సిద్ధం చేశారు. మరోవైపు ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను పెంచబోమని నిర్మాతలు ప్రకటించడం కూడా సినిమాకు కలిసొచ్చింది. అయితే ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగుండటం ఒక్కటే విజయానికి హామీ కాదన్న విషయం గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. విడుదల తర్వాత కథ, భావోద్వేగాలు, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నదే అసలు పరీక్ష. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాల్లో కంటెంట్ క్లిక్ అయితేనే లాంగ్ రన్ సాధ్యమవుతుంది.

అందుకే ఇప్పుడు అందరి దృష్టి చెన్నై లవ్ స్టోరీ రిజల్ట్ పైనే ఉంది. బేబీ సృష్టించిన నమ్మకంతో సినిమాకు మంచి బిజినెస్ జరిగినా.. అదే స్థాయిలో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటేనే అది మరో హిట్ గా నిలుస్తుంది. లేదంటే మంచి బిజినెస్‌ తో ప్రారంభమైన సినిమా అనే గుర్తింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది. మరి బేబీ సెంటిమెంట్ ఈసారి కూడా నిర్మాతలకు కలిసి వస్తుందా? లేదా? అనేది విడుదల తర్వాత తేలనుంది.