Begin typing your search above and press return to search.

ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపులు!

గత కొన్ని రోజులుగా తమిళనాడుకి చెందిన సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   15 Oct 2025 1:55 PM IST
ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపులు!
X

గత కొన్ని రోజులుగా తమిళనాడుకి చెందిన సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. వీటివల్ల అటు సెలబ్రిటీలు ఇటు రాజకీయ నాయకులు, అభిమానులు గందరగోళానికి గురి అవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు కలకలం సృష్టించిన ఈ బాంబు బెదిరింపులు.. ఇప్పుడు మరొకసారి తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ప్రముఖుల ఇల్లు, ప్రధాన కార్యాలకు బాంబు బెదిరింపులు రాగా .. ఇప్పుడు ఏకంగా చెన్నైలోని పలు విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకి కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి.

విషయంలోకి వెళ్తే.. చెన్నైలోని రష్యా, శ్రీలంక , అమెరికా, ఇంగ్లాండ్ , థాయిలాండ్, సింగపూర్ కార్యాలయాలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇలా బాంబు బెదిరింపులకు సంబంధించి ఈ మెయిల్స్ వచ్చాయి. బాంబు పేలుళ్లు జరగనున్నట్లు వచ్చిన ఈ వార్తలతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. అటు వీరితోపాటు చెన్నై టీ.నగర్ లో ఉన్న ఇళయరాజా స్టూడియోకి కూడా మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. డీజీపీ ఆఫీస్ తో పాటు ఇళయరాజా మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ తో స్టూడియోకి చేరుకొని తనిఖీలు నిర్వహించగా అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదట. ఇదే మెయిల్ అడ్రస్ తో గత కొన్ని వారాలుగా చెన్నైలోనే పలువురు వీఐపీలకు ఇదే తరహా బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇప్పుడు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఇలా కావాలనే ఎవరో బాంబు బెదిరింపులు చేస్తున్నారని , దీనిని గనుక నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఇలా బెదిరింపులు ఎదుర్కొన్న వారిలో ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్, నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ , గవర్నర్ భవనాలకు కూడా ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల నివాసాలకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. ఇలా వచ్చిన ప్రతిసారి కూడా నకిలీ బెదిరింపులేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏది ఏమైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ ప్రజలలో భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. మరి దీనిపై ఇళయరాజా ఏదైనా స్పందిస్తారో చూడాలి.