ఛాతా పచ్చ టాక్: యాక్షన్ అదిరింది.. కానీ..
గత నెల రోజులుగా 'ఛాతా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్' ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
By: M Prashanth | 23 Jan 2026 5:58 PM ISTగత నెల రోజులుగా 'ఛాతా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్' ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ప్రమోషన్ లో మేకర్స్ వీలైనంత ఎక్కువగా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లలో ట్రైలర్ ను ప్రమోట్ చేశారు. మలయాళ మేకర్స్ నుండి వస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ కావడంతో నేడు విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇండియన్ సినిమా రావడం, అది కూడా మలయాళీ నేటివిటీతో ఉండటంతో యూత్ ఈ సినిమాపై ఫుల్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఇక సినిమాకు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అనే వివరాల్లోకి వెళితే..
ఈ సినిమాకు సంబంధించిన టాక్ విషయానికి వస్తే.. ప్రధానంగా యాక్షన్ లవర్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ ఎంచుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌డ్రాప్ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. కేరళలోని కొచ్చి నేపథ్యంలో సాగే ఈ రెజ్లింగ్ డ్రామాలో యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. అర్జున్ అశోకన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, రోషన్ మాథ్యూ, ఇషాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా చిన్న పాప రోజమ్మ పాత్రలో వేదిక శ్రీకుమార్ చేసే అల్లరి థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది.
సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ సినిమాకు గ్రాండ్ లెవల్ లుక్ తీసుకొచ్చాయి. శంకర్ ఎహసాన్ లాయ్ అందించిన పాటలు బాగుండగా, ముజీబ్ మజీద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. మలయాళ సినిమాలంటేనే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి, ఆ విషయంలో ఈ దర్శకుడు విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అయితే, ఫస్ట్ హాఫ్ చాలా ఎనర్జిటిక్‌గా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా కాస్త నెమ్మదించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కేవలం ఒకదాని వెనుక ఒకటి వచ్చే యాక్షన్ సీన్లు బాగున్నప్పటికీ, వాటి వెనుక ఉండాల్సిన ఎమోషన్ మిస్ అవ్వడం సినిమాకు మైనస్‌గా మారింది. కథనం కూడా చాలా వరకు ఊహించదగినదిగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా చివర్లో వచ్చే మెగాస్టార్ మమ్ముట్టి కామియో అప్పియరెన్స్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయనను స్క్రీన్ మీద చూడటం సంతోషంగా ఉన్నా, ఆయన క్యారెక్టర్ డిజైన్, లుక్ మాత్రం కాస్త నిరాశపరిచిందని కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం యాక్షన్ మీద పెట్టిన ఫోకస్ కథ మీద పెట్టలేదని టాక్ వస్తోంది.
ఇక 'ఛాతా పచ్చ' సినిమా డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే నేటి జనరేషన్ ఆడియన్స్‌కు ఒక మంచి ఫీస్ట్ అని చెప్పాలి. పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగా ఇది మెప్పిస్తున్నా, ఎమోషనల్ డెప్త్ ఆశించే వారికి మాత్రం ఇది కొంచెం నిరాశ కలిగించవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీకెండ్ లో ఈ 'రింగ్ ఆఫ్ రౌడీస్' ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
