లవ్ ట్రాక్ లేకుండా పూరీ సినిమా? ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు
ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషిస్తున్న పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన ఒక బ్లైండ్ బెగ్గర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
By: Sravani Lakshmi Srungarapu | 24 March 2026 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్లమ్‌డాగ్.. 33 టెంపుల్ రోడ్ సినిమా మొదటినుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం ఈ సినిమాపై మరింత చర్చకు దారితీస్తోంది. సాధారణంగా సినిమాలో హీరో హీరోయిన్ ఉన్నప్పుడు ప్రేక్షకులు ముందుగా ఊహించేది లవ్ ట్రాక్. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి రొమాంటిక్ యాంగిల్ లేకపోవడం విశేషంగా మారింది.
విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించినట్లుగా, ఈ సినిమాలో తనకు మరియు టబుకు మధ్య ఎలాంటి లవ్ స్టోరీ ఉండదట. తమ పాత్రల స్వభావం వల్ల సెట్‌లో కూడా తామిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోలేదని సేతుపతి చెప్పడం చూస్తుంటే ఈ సినిమాకి ఉన్న గాఢతను సూచిస్తోంది. స్క్రీన్ పై కనిపించే పాత్రల ఎమోషనల్ డిస్టెన్స్, ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలాగే కొనసాగిందంటే, ఈ సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే సరదా, రొమాన్స్‌లకు భిన్నంగా, ఈ సినిమా మరింత గంభీరమైన ఎమోషన్స్ తో నిండిన కథను అందించబోతోందని స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషిస్తున్న పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన ఒక బ్లైండ్ బెగ్గర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈసారి కూడా పూర్తిగా కొత్త కోణాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రలోని అంతర్ముఖ భావాలు, జీవన పోరాటం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండే అవకాశముంది.
ఇక టబు పాత్ర విషయానికి వస్తే, ఆమె క్యారెక్టర్ సినిమాకు ప్రధాన సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని విజయ్ సేతుపతి వెల్లడించారు. స్లమ్ డాగ్ లో టబు క్యారెక్టర్ గురించి సేతుపతి చేసిన కామెంట్స్ సినిమాపై, టబు పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాకుండా, ఆమెకి తెలుగులో ఉన్న పట్టు, నటనపై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం. టబు యాక్టింగ్ ను దగ్గరగా చూడటం ఒక ప్రివిలేజ్ అని సేతుపతి చెప్పడం, ఈ సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
విజయ్ సేతుపతి చేసిన ఈ ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్‌పై ఆధారపడే కథలకు భిన్నంగా, స్లమ్‌డాగ్.. 33 టెంపుల్ రోడ్ పూర్తిగా క్యారెక్టర్ల డెప్త్, ఎమోషన్స్ పై భావోద్వేగాలపై ఆధారపడి నడిచే సినిమాగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే రొమాన్స్ లేకపోవడం, సీరియస్ క్యారెక్టర్స్, హీరో బ్లైండ్ రోల్, టబు సర్ప్రైజ్ ఎలిమెంట్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాపై ప్రత్యేకమైన అంచనాలను సృష్టిస్తున్నాయి. చూస్తుంటే పూరీ ఈసారి ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టున్నాడు.
