జేడీ ప్రవర్తనపై చంద్రహాస్ ఆగ్రహం.. ఎక్స్పెక్ట్ చేయలేదంటూ!
సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే.. కానీ, హీరోగా పరిచయం కాకముందే వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం మాత్రం అరుదు.
By: Madhu Reddy | 8 Feb 2026 3:44 PM ISTసినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే.. కానీ, హీరోగా పరిచయం కాకముందే వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం మాత్రం అరుదు. ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. "బరాబర్ ప్రేమిస్తా" సినిమా ఈవెంట్‌లో మొదలైన ఒక చిన్న చిచ్చు, ఇప్పుడు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి వరకు చేరి పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ప్రభాకర్ ఆవేదన ఏమిటి? చంద్రహాస్ అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.
ఈవెంట్ లో రచ్చ.. ప్రభాకర్ బహిరంగ క్షమాపణ:
ఈ వివాదానికి మూలం "బరాబర్ ప్రేమిస్తా" చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్. ఈ వేదికపై చంద్రహాస్ సరదాగా పాడిన ఒక పాటలో అభ్యంతరకర పదజాలం ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. గతంలో కూడా చంద్రహాస్ బాడీ లాంగ్వేజ్, మాటతీరుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈ తాజా ఘటన నెటిజన్లకు ఆయుధంగా మారింది. దీనిపై తండ్రి ప్రభాకర్ స్పందిస్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మాటలను తప్పుడు అర్థంలో తీసుకోవద్దని, ఒక చిన్న పొరపాటును సాకుగా చూపి తన పెంపకాన్ని, కుటుంబాన్ని విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని ఆయన పెద్ద మనసుతో బహిరంగంగా కోరారు.
జేడీ చక్రవర్తి వ్యాఖ్యలు.. వివాదంలోకి సీనియర్ నటుడు:
ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు మళ్లీ మంట పుట్టించాయి. ఆ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లిన జేడీ చక్రవర్తి, ఆ తర్వాత ఒక వీడియోలో మాట్లాడుతూ.. "అసలు ఆ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వెళ్లకుండా ఉండాల్సింది" అని కామెంట్ చేశారు. అక్కడ జరిగిన పరిణామాలు లేదా చంద్రహాస్ ప్రవర్తన పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. ఒక సీనియర్ నటుడు ఇలా బహిరంగంగా అనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది ప్రభాకర్ కుటుంబానికి కాస్త ఇబ్బందికరంగా మారింది.
జేడీపై చంద్రహాస్ ఫైర్.. ముందు ఒకలా.. వెనుక ఒకలా?:
జేడీ చక్రవర్తి వ్యాఖ్యలపై చంద్రహాస్ కూడా గట్టిగానే స్పందించారు. జేడీ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు, బాగా చేస్తున్నావ్ అని మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి గెస్ట్‌గా వెళ్లకుండా ఉండాల్సింది అని అనడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే నన్ను అప్పుడే స్టేజి పైకి వచ్చి అనాల్సింది. కానీ ఇప్పడు అనటం ఏంటి అని కౌంటర్ ఇచ్చారు. నా ముందు ఒకలా మాట్లాడి, వెనుక మరోలా మాట్లాడటం సరికాదని, ఆయనపై తనకున్న గౌరవం తగ్గిందనేలా చంద్రహాస్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు. దీంతో ఈ వివాదం ఇప్పుడు చంద్రహాస్ వర్సెస్ జేడీ చక్రవర్తిగా మారిపోయింది.
సినీ రంగంలో విమర్శలు, వివాదాలు సహజమే అయినా.. ఒక యువ హీరో కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం గమనార్హం. తండ్రిగా ప్రభాకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, చంద్రహాస్ దూకుడు స్వభావం వివాదాలను మరింత పెంచుతోంది. సీనియర్లు చెప్పే సలహాలను స్వీకరిస్తూనే, తన ప్రవర్తనతో ప్రేక్షకులను మెప్పించడంపై దృష్టి పెడితే చంద్రహాస్ కెరీర్‌కు మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేక మరింత ముదురుతుందో వేచి చూడాలి.
