Begin typing your search above and press return to search.

సుకుమార్ కోసం ఒక గంట.. రాజమౌళి కోసం ఒకటిన్నర సంవత్సరం!

గేయ రచయిత చంద్రబోస్ తన పాటల రచనలోని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ‘రంగస్థలం’ సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాటను కేవలం 40 నిమిషాల్లో రాశానని తెలిపారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లోని ఆస్కార్ విజేత ‘నాటు నాటు’ పాట తుది రూపం దాల్చడానికి 19 నెలలు పట్టిందని వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులు, పదాలు, కంపోజిషన్‌లో మార్పులు ఇందుకు కారణమని చెప్పారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 Nov 2026 7:57 AM IST
సుకుమార్ కోసం ఒక గంట.. రాజమౌళి కోసం ఒకటిన్నర సంవత్సరం!
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన మన సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ ఇద్దరు దర్శకులతో పనిచేసిన అనుభవాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ వెల్లడించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒక పాట రాయడానికి కొన్నిసార్లు కొన్ని నిమిషాలే సరిపోతాయి. మరికొన్ని పాటల కోసం నెలల తరబడి సమయం కేటాయించాల్సి వస్తుంది. తన సినీ ప్రయాణంలో ఇలాంటి రెండు విభిన్న అనుభవాలను చంద్రబోస్ పంచుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, తన కెరీర్‌లో అత్యంత వేగంగా పూర్తిచేసిన పాట గురించి, ఎక్కువ సమయం తీసుకున్న పాట గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం.. సినిమాలోని ఎంత సక్కగున్నావే పాటను కేవలం 40 నిమిషాల్లోనే రాసినట్లు చంద్రబోస్ తెలిపారు. అంటే ఒక గంట లోపల ఇంత అద్భుతమైన పాటను రచించానని చెప్పుకొచ్చారు చంద్రబోస్. ఆ పాటకు సంబంధించిన పదాలు చాలా సహజంగా వచ్చాయని, అందుకే తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగానని ఆయన వెల్లడించారు.

అయితే, తన కెరీర్‌లో అత్యధిక సమయం తీసుకున్న పాట మాత్రం నాటు నాటు అని చంద్రబోస్ చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. అయితే ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందని చంద్రబోస్ వివరించారు.

నాటు నాటు పాట మొదటి వెర్షన్‌ను త్వరగానే రాసినప్పటికీ, దాని కంపోజిషన్, పదాల్లో మార్పులు, ఇతర కారణాల వల్ల తుది రూపం రావడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితులు కూడా ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయని తెలిపారు. మొత్తంగా ఈ పాట పూర్తవడానికి 19 నెలలు పట్టిందని వెల్లడించారు.

ఈ పాటకు ఆస్కార్ రావడంపై స్పందిస్తూ, తనలో ఉన్న సహనానికి ఈ అవార్డు వచ్చిందేమోనని చంద్రబోస్ సరదాగా వ్యాఖ్యానించారు.