చంద్రబోస్ వారి స్థానాలను భర్తీ చేస్తారా?
ఒకప్పుడు తెలుగు పాటలలో తెలుగు సాహిత్యం ఉట్టిపడేది.. ఆ పాటలు వినడానికి వినసొంపుగా ఉండడమే కాకుండా ఎన్నో విషయాలను మనకు పాటల ద్వారా ఆ రచయితలు తెలియజేసేవారు
By: Ramesh Boddu | 11 Jan 2026 11:44 AM ISTఒకప్పుడు తెలుగు పాటలలో తెలుగు సాహిత్యం ఉట్టిపడేది.. ఆ పాటలు వినడానికి వినసొంపుగా ఉండడమే కాకుండా ఎన్నో విషయాలను మనకు పాటల ద్వారా ఆ రచయితలు తెలియజేసేవారు. ఎప్పుడైతే దిగ్గజ రచయితలుగా పేరు దక్కించుకున్న వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాలం చేశారో .. ఆ తర్వాతి కాలంలో తెలుగు సినీ పాటలు స్థాయి తగ్గిపోయిందని.. ఇప్పుడు వస్తున్న పాటలలో ఆ సాహిత్యం, మాధుర్యం వినిపించడం లేదు అంటూ సాహితి అభిమానులు బాధపడుతున్నారు. వారి స్థానాలను భర్తీ చేసే వారే లేరా అని బాధపడుతున్న నేపథ్యంలో చంద్రబోస్ తానున్నాను అంటూ ముందుకు వచ్చారు.. అంతేకాదు తన సాహిత్యంతో తెలుగు పాట స్థాయిని నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించినప్పుడు ఆయన పాటించిన ప్రమాణాలను అనుసరిస్తూ తెలుగు పాటను నిలబెడతానని చంద్రబోస్ శపథం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ శపథాన్ని ఇప్పుడు బోస్ నిలబెట్టుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకు పాటలు రాసినా.. సరే తన ముద్ర చూపిస్తూ ఆ పాట వినగానే ఈ పాట చంద్రబోస్ రాశారు అని ప్రతి ఒక్కరు అనుకునేలా తన మార్కు చూపిస్తున్నారు చంద్రబోస్.
అలాంటి ఈయన తన కెరీర్లో 3600 వరకు పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాసిన "నాటు నాటు" పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం లభించడం నిజంగా విశేషం అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి పాత్రలను భర్తీ చేస్తూ తెలుగు పాటలను బ్రతికించడంలో తన వంతు కృషి చేస్తున్నారు చంద్రబోస్ అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఒకసారి రంగస్థలంలోని సినిమా పాటలను కేవలం గంటల వ్యవధిలోనే పూర్తి చేసి, పెన్ను పేపరు పట్టుకోకుండానే పాటల లిరిక్స్ అన్ని నోటితోనే చెప్పేశాను అని, అవి అలాగే రికార్డు అయ్యాయని ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పి తన టాలెంట్ ఏంటో నిరూపించారు చంద్రబోస్.
చంద్రబోస్ విషయానికి వస్తే.. గీత రచయితగా, గాయకుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన.. 1995లో తాజ్ మహల్ చిత్రంతో గీతా రచయితగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. 25 సంవత్సరాల కు పైగా తన కెరియర్లో 850 కి పైగా చిత్రాలలో 3600 పాటలకు సాహిత్యం రాసి మంచి పేరు దక్కించుకున్నారు. ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకున్నారు. పైగా ఒక నేషనల్ అవార్డు , రెండు నంది అవార్డులు , 2 ఫిలింఫేర్ అవార్డులు, 3 సైమా అవార్డులు కూడా దక్కించుకున్నారు చంద్రబోస్.. ఈయన రాసిన ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. వేటూరి , సిరివెన్నెల తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక రచయితగా చంద్రబోస్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.
