Begin typing your search above and press return to search.

పోకిరి, 1- నేనొక్క‌డినే టైటిల్స్ అలా పుట్టాయి.. చంద్ర‌బోస్ అద్భుత విశ్లేష‌ణ‌

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన `టక్కరి దొంగ` చిత్రంలో ఆస్కార్ గ్రహీత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాసిన ఒక గీతం యువతరం హృదయాలలో ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

By:  Sivaji Kontham   |   17 Oct 2026 8:41 PM IST
పోకిరి, 1- నేనొక్క‌డినే టైటిల్స్ అలా పుట్టాయి.. చంద్ర‌బోస్ అద్భుత విశ్లేష‌ణ‌
X

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన `టక్కరి దొంగ` చిత్రంలో ఆస్కార్ గ్రహీత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాసిన ఒక గీతం యువతరం హృదయాలలో ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఆ పాటలోని సాహిత్య అర్థం అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన అద్భుతమైన ట్యూన్ ఈ పాటకు మరింత ప్రాణం పోసింది. `టక్కరి దొంగ` చిత్రంలో మిగతా పాటలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క పాట మాత్రం మరో ఎత్తుగా నిలిచింది. అంతటి విశేషమైన పాటను చంద్రబోస్ ఎంతో సృజనాత్మకంగా రాశారు.

అయితే ఆ పాటలో ఉపయోగించిన కొన్ని అద్భుతమైన పదాలు.. తదనంతరం కాలంలో టాలీవుడ్‌లో ఏకంగా కొన్ని సినిమాలకు టైటిళ్లుగా మారడం విశేషం. ఇదే విషయాన్ని దర్శకుడు సంపత్ నందితో జరిగిన ఒక చిట్‌చాట్‌లో లిరిసిస్ట్ చంద్రబోస్ స్వయంగా వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఆ మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ``మహేష్ బాబు గారికి `నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు, నేను ఒక్కడిని ఒక వైపు… లోకం ఒక వైపు`` అని రాశాను, ఆ తర్వాతే `1: నేనొక్కడినే` సినిమా వచ్చింది`` అని తెలిపారు. అలాగే ``బుద్ధిమంతుడు పేరు దక్కడం నథింగ్ స్పెషల్, బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్, పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్` అని రాసిన పదాల నుంచి తదనంతరం `పోకిరి` సినిమా టైటిల్ పుట్టుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు.

ఎవరినైనా లేదా ఏదైనా ముందుగా పసిగట్టాలని.. వారిలోని కరిష్మాని (ప్రభావం) చూసి మనం ఫీలై దానిని పదాల రూపంలో రాయడమే రచయిత ప్రతిభ అని సంపత్ నందితో ముచ్చ‌ట్లు వెల్ల‌డించాయి. ఒక పాటలోని చిన్న పదాలు లేదా లైన్లు ఎలా భవిష్యత్తులో పెద్ద సినిమాల టైటిల్స్‌గా రూపాంతరం చెందాయో చంద్ర‌బోస్ వివరించిన తీరు సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఆర్.ఆర్.ఆర్ లోని ఆస్కార్ విన్నింగ్ `నాటు నాటు ..` గీతాన్ని మించిన అద్భుత సాహిత్యాన్ని త‌న కెరీర్ లో చంద్ర‌బోస్ రాసారు. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఆయ‌న పేరు అరుదైన లిరిసిస్టుగా లిఖించ‌ద‌గిన‌ది. టాలీవుడ్ ని ఏలిన ఎంద‌రో దిగ్గ‌జ లిరిసిస్టుల జాబితాలో ఆయ‌న పేరు చిర‌స్థాయిగా నిలిచి ఉంటుంది. వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి త‌ర్వాత సుదీర్ఘ కాలం లిరిసిస్టుగా క‌లాన్ని ఝ‌లిపించిన మేటి లిరిసిస్టుగా ఆయ‌న‌ పేరు ఎన్న‌టికీ చ‌రిత్ర‌లో నిలిచి ఉంటుంది.