రచయితల తలరాతను మార్చిన సిరివెన్నెల
సినిమా పరిశ్రమలో పాటల రచయితలకు ఆదాయం ఎలా వస్తుందో సాధారణ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.
By: M Prashanth | 7 Jan 2026 9:26 AM ISTసినిమా పరిశ్రమలో పాటల రచయితలకు ఆదాయం ఎలా వస్తుందో సాధారణ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కేవలం సినిమాకి పాట రాసినప్పుడు ఇచ్చే డబ్బులు మాత్రమే వారికి అందుతాయని చాలామంది అనుకుంటారు. అయితే ఒకప్పుడు సినిమా పాటల రచయితల పరిస్థితి అంత తెలిసిందే. చేతిలో కలం, మెదడులో పదును ఉన్నంతకాలం మాత్రమే వారికి విలువ ఉండేది. వయసు మళ్ళిన తర్వాత, అవకాశాలు తగ్గినప్పుడు ఎంతోమంది దిగ్గజ రచయితలు కూడా పేదరికంతో దీనస్థితిని అనుభవించారు. అయితే నేటితరం రచయితలకు అలాంటి దుస్థితి రాకూడదని, వారికి ఒక బంగారు భవిష్యత్తును అందించి వెళ్ళారు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత చంద్రబోస్ చాలా ఎమోషనల్ గా గుర్తు చేసుకున్నారు.
రచయితలకు కేవలం పారితోషికమే కాదు, పాట వినిపించిన ప్రతిసారి రాయల్టీ రావాలని సిరివెన్నెల గారు ఎంతగానో తపించారు. దీనికోసం ఆయన తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దాదాపు ఆరు నెలల పాటు న్యాయశాస్త్ర పుస్తకాలను క్షుణ్ణంగా చదివారని చంద్రబోస్ తెలిపారు. లాయర్లతో చర్చించి, నిర్మాతలతో పోరాడి IPRS (ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ) ద్వారా రచయితలకు దక్కాల్సిన హక్కులను సాధించిపెట్టారు. సిరివెన్నెల గారు చేసిన ఆ ఒక్క యుద్ధం వల్లే ఈరోజు రచయితల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.
అంటే.. ఒక పాట ప్రజల్లోకి వెళ్ళాక అది ఎక్కడ ప్లే అయినా రచయితకు డబ్బులు వస్తాయి. టీవీలు, రేడియోలు, విమానాశ్రయాలు, హోటళ్లు, పబ్బులు, పార్టీలు, రియాలిటీ షోలు.. ఇలా ఎక్కడ మన పాట వినిపించినా దానికి సంబంధించిన రాయల్టీ వస్తుంది. ఉదాహరణకు ఒక పాట ద్వారా రాయల్టీ రూపంలో ఒక రూపాయి ఆదాయం వస్తే, అందులో 25 పైసలు రచయితకు, 25 పైసలు సంగీత దర్శకుడికి, మిగిలిన 50 పైసలు ఆడియో కంపెనీ లేదా నిర్మాతకు వెళ్తాయి అంటూ చంద్రబోస్ చాలా సింపుల్ గా తెలిపారు.
అలాగే చంద్రబోస్ మరో ఆసక్తికరమైన ఉదాహరణను బయటపెట్టారు. ఆవారా సినిమాలోని 'చిరు చిరు చినుకై కురిసావే..' పాటకు అప్పట్లో ఆయనకు నిర్మాత ఇచ్చిన పారితోషికం కేవలం 25 వేల రూపాయలు మాత్రమేనట. కానీ ఆ పాట ప్రజల్లోకి బలంగా వెళ్ళడం వల్ల.. ఇప్పటివరకు కేవలం రాయల్టీల రూపంలోనే ఆ ఒక్క పాట ఆయనకు ఏకంగా 10 లక్షల రూపాయలు సంపాదించి పెట్టిందట.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్నంతసేపే డబ్బు కనిపిస్తుంది. కానీ ఈ సిస్టమ్ వల్ల పాట బతికున్నంత కాలం రచయితకు డబ్బు అందుతూనే ఉంటుంది. ఇది వారికి ఒక పెన్షన్ లాగా ఉపయోగపడుతుందని, ఆనాడు శాస్త్రి గారు పడ్డ కష్టమే ఈరోజు తమకు శ్రీరామరక్షగా మారిందని చంద్రబోస్ విశ్లేషించారు. కేవలం రచయితలకే కాదు, ఇప్పుడు సింగర్స్ కి కూడా రాయల్టీలు అదే తరహాలో ఇసామ్రా (ISAMRA) అనే అసోసియేషన్ ద్వారా అందుతున్నాయని అన్నారు.
