డ్రీమ్ కారును సొంతం చేసుకున్న ఆస్కార్ విజేత.. త్వరలో చంద్రబోస్ ఇంట్లో పెళ్లి బాజాలు!
భారతదేశానికి `బెస్ట్ ఒరిజినల్ సాంగ్` కేటగిరీలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డును అందించి.. తెలుగు పాట సత్తాను ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పిన ఘనత ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ కి దక్కుతుంది.
By: Sivaji Kontham | 21 Aug 2026 10:38 PM ISTభారతదేశానికి `బెస్ట్ ఒరిజినల్ సాంగ్` కేటగిరీలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డును అందించి.. తెలుగు పాట సత్తాను ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పిన ఘనత ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ కి దక్కుతుంది. `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలోని `నాటు నాటు` పాటతో ఆయన కలం బలం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన, భావోద్వేగమైన పాటలకు సాహిత్యాన్ని అందించినా.. నాటు నాటు తెచ్చిపెట్టిన అంతర్జాతీయ గుర్తింపు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
ఆస్కార్ విజేతగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన చంద్రబోస్ తాజాగా తన జీవితంలో ఉన్న మరొక వ్యక్తిగత డ్రీమ్‌ను నెరవేర్చుకున్నారు. ఆయన ఎంతగానో ఇష్టపడే తన కలల కారు `పోర్షే` లగ్జరీ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ కొత్త కారును డెలివరీ తీసుకున్న సంతోషకర క్షణంలో కారు ఫొటోను షేర్ చేస్తూ `నా కల నిజమైంది` అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ డార్క్ నేవీ బ్లూ కలర్ పోర్షే కార్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
మరోవైపు చంద్రబోస్ కుటుంబంలో త్వరలోనే ఎంతో కోలాహలంగా వివాహ వేడుకలు జరగబోతున్నాయి. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆయన కుమారుడి వివాహం వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ లో ఈ వివాహ మహోత్సవాన్ని నిర్వహించనుండగా.. ఆ తర్వాతి మొదటి ఆదివారం (సెప్టెంబర్ 6న) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం.
అయితే చంద్రబోస్ కొనుగోలు చేసిన ఈ కొత్త లగ్జరీ కారుకు.. వచ్చే నెలలో జరగబోయే కుమారుడి పెళ్లి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత ఇష్టంతో తన కలల కారును సొంతం చేసుకోవాలనే కోరికతో కొనుగోలు చేసినది. వచ్చే నెల మొత్తం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పెళ్లి వేడుకలను అత్యంత వేడుకగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ ఆస్కార్ స్థాయికి ఎదిగిన చంద్రబోస్ ఇలా ఒకవైపు వ్యక్తిగత జీవితంలో తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ కారును సొంతం చేసుకోవడం.. మరొకవైపు ఇంట్లో శుభకార్యానికి సిద్ధమవుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
