అలవోకగా పదాలు అల్లుతూ పాటలు పాడుతూ అంత్యాక్షరి అదిరేను!
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ - వర్ధమాన గాయని లిప్సిక కాంబినేషన్‌లో సాగిన మ్యూజికల్ క్యారమ్స్ ముచ్చట్లు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
By: Sivaji Kontham | 6 July 2026 10:36 PM ISTఆటతో పాట జోడీ కడితే.. పాటల రచయిత గాయకుడిగా మారి.. ఒక గాయనితోనే పోటీపడితే.. అది గమ్మత్తయిన మధురమైన స్వరాలాపనగా.. హృదయాలను ఎలా తాకుతుందో.. తెలియాలంటే..ఇది చూడాలి..!
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ - వర్ధమాన గాయని లిప్సిక కాంబినేషన్‌లో సాగిన మ్యూజికల్ క్యారమ్స్ ముచ్చట్లు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం రీల్స్ చేయడమే కాకుండా.. కాసేపు సరదాగా సమయాన్ని గడపడానికి ఈ ఇద్దరు కళాకారులు క్యారమ్స్ బోర్డు ముందుకు రావడం... అక్కడ సరికొత్త రీతిలో ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఒక సీనియర్ దిగ్గజ రచయిత అయి ఉండి కూడా చంద్రబోస్ ఎంతో ఒదిగిపోయి వర్ధమాన గాయనితో చేసిన ఈ సందడి ప్రతి ఒక్కరికీ వీనులవిందుగా, కన్నుల పండుగగా నిలిచింది.
ఈ సరదా భేటీలో కేవలం ఆట మాత్రమే కాకుండా.. మాటలను పాటల బాణీల్లోకి మారుస్తూ సాగిన `విచిత్ర అంత్యాక్షరి` ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చంద్రబోస్ అంత్యాక్షరి ఆటలో `కా` అనే అక్షరంతో పాటను లాలిత్యంగా ప్రారంభించగా.. దానికి కౌంటర్‌గా లిప్సిక `రీల్స్ చేయడం.. ఇలా ఆటలాడడం` అంటూ ప్రాసలతో కూడిన సాహిత్యంతో బదులిచ్చారు. ఇద్దరి మధ్య సాగిన ఈ గీతాల జుగల్బందీలో `బాపు బొమ్మలాగ ఉన్నావు`... `మునగచెట్టు ఎక్కిస్తే ఆనందంతో ఊపిరాగిపోదా` వంటి చమత్కారభరితమైన పదాల కూర్పు తెలుగుదనం లాలిత్యాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది.
సాధారణ అంత్యాక్షరి ముగిసిన తర్వాత గాయని లిప్సిక మరో అడుగు ముందుకు వేసి చంద్రబోస్ కి `రాపిడ్ ఫైర్ అంత్యాక్షరి` లో ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు. అందులో భాగంగా మీ కెరీర్‌లో ఎక్కువ పాటలు ఎవరికి రాశారని అడగ్గా.. చంద్రబోస్ ఎంతో ఆప్యాయంగా స్వరబ్రహ్మ `కీరవాణి` గారి పేరును గుర్తుచేసుకున్నారు. `రాసింది కీరవాణి.. కూసింది చంద్రబోసు` అనే ట్యాగ్‌లైన్‌ను నిరూపిస్తూ... వారిద్దరి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భం మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేసింది.
ఇక వ్యక్తిగతంగా... మీ ఇంట్లో అన్ని విషయాల్లో ఎవరు బాస్ అని లిప్సిక అడిగిన ప్రశ్నకు చంద్రబోస్ ఏమాత్రం తడుముకోకుండా తన భార్య `సుచి` (సుచిత్ర) పేరును పదే పదే చెప్తూ నవ్వులు పూయించారు. అలాగే అమెరికా వెళితే ఏ హోటల్‌లో బస చేయడం ఇష్టమని అడగ్గా.. తన మిత్రుడు `వనమాలి ప్లాటులో` ఉండడమే తనకు ఇష్టమని సమాధానమిచ్చారు. పొరపాటున నోటివెంట వచ్చిన అక్షరాలను కూడా బాసర సరస్వతి దేవి దయవల్ల తనకు అనువుగా మలుచుకోవడం అలవాటైపోయిందని చంద్రబోస్ గారు తన సమయస్ఫూర్తిని చాటుకున్నారు.
చివరగా లిప్సికను ఆటలో `యు ఆర్ అవుట్` అంటూ చంద్రబోస్ సరదాగా ఆటపట్టించడంతో ఈ ముచ్చటైన మ్యూజికల్ సెషన్ ముగిసింది. ఒకవైపు ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న ఆస్కార్ విజేత.. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యువ గాయని లిప్సిక.. ఇద్దరి మధ్య కుదిరిన మ్యూజికల్ సింక్, టైమింగ్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచాయి. పాటల్లోని సాహితీ గరిమను, నిత్య జీవితంలోని హాస్యాన్ని మేళవించి రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో అలరిస్తోంది. ముఖ్యంగా కీరవాణి సాహిత్యం, సంగీతానికి చంద్రబోస్ గానాలాపన చేయడం ఎంతగానో ఆశ్చర్యపరిచింది. బోస్ స్వరమాధుర్యం ఎలా ఉంటుందో మరోసారి అభిమానులకు పరిచయమైంది.
ఈతరం పిల్లలు పిచ్చి పిచ్చి రీల్స్ చెయ్యకుండా.. అప్పుడప్పుడూ ఇలా అలవోకగా పాటలు అల్లుతూ, పాటలు పాడుతూ అంత్యాక్షరి ఆడుతూ ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలి! నేటి బాలలే..రేపటి కీరవాణి-చంద్రబోసులు.. అంటూ నెటిజనులు ఎంకరేజ్ చేస్తున్నారు.
కీరవాణి సాహిత్యం, సంగీతం అమృత వర్షిణి గా ఉంది బోసు గారి గానం ..లిప్సిక మాట, పాట రెండూ ఎంతో సహజంగా, ఉన్నాయి.ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు.. అంటూ లవ్- హార్ట్ ఈమోజీలను యూత్ సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు అంటే.. ఈ పాట అందరికీ అంతగా కనెక్టయిందనేగా అర్థం!
