బాలయ్య ఆరోగ్యం పై పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!
సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు.
By: Srikanth Kontham | 27 July 2026 8:36 AM ISTసినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు, బాలయ్య ఆరోగ్యంపై వైద్యులతో ప్రత్యేకంగా చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటుండటంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాకినాడ పోర్టు షూటింగ్‌లో ప్రమాదం:
కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న 'ఎన్‌బీకే-111' సినిమా షూటింగ్‌లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయం కావడంతో, మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల బృందం సుమారు మూడు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం:
ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, ఆయన కోలుకోవడానికి పట్టే సమయం గురించి వైద్యులను వివరంగా అడిగారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం బాలయ్యకు ప్రత్యేక నీ క్యాప్ అమర్చామని వైద్యులు తెలిపారు. ఇక చంద్రబాబు నేరుగా బాలకృష్ణతో మాట్లాడి, కొన్నిరోజులు షూటింగ్‌లు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సోదరభావంతో సూచించారు.
6 వారాల విశ్రాంతి.. డాక్టర్ల కీలక సూచన:
శస్త్రచికిత్స తర్వాత గాయం పూర్తిగా మానేందుకు బాలకృష్ణకు కనీసం 6 వారాల పాటు (నెలన్నర) పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక దీంతో ఈ ఆరు వారాల పాటు ఆయన సినిమా సెట్స్‌కు, రాజకీయ సభలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వైద్యుల సూచనల ప్రకారం పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఆయన మళ్లీ కెమెరా ముందుకు, ప్రజా జీవితంలోకి అడుగుపెడతారు.
ఆలయంలో హోమం జరిపించిన దర్శకుడు గోపీచంద్:
మరోవైపు తమ అభిమాన కథానాయకుడు, డైనమిక్ హీరో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని బెంగళూరులోని కాటేరమ్మ ఆలయంలో 18 మంది వేద పండితులతో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని సినీ ప్రముఖులు, నందమూరి అభిమానులు పలు దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
త్వరగా తిరిగోవాలని ఆకాంక్షిద్దాం:
సినిమా కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని బాలకృష్ణ, ఈ చిన్న విరామం తర్వాత మళ్లీ అదే జోష్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటుండటం పట్ల నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య త్వరగా పూర్తి స్వస్థత చేకూర్చుకుని, మళ్లీ వెండితెరపై సంచలనాలు సృష్టించాలని మనసారా కోరుకుందాం.
