ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయి
టెక్నాలజీ పెరిగిపోతోంది. దానిని అందిపుచ్చుకున్న చోట అభివృద్ధి సంపద ఆరోగ్యం అన్నీ ఉంటున్నాయి.
By: Satya P | 31 Jan 2026 7:00 AM ISTటెక్నాలజీ పెరిగిపోతోంది. దానిని అందిపుచ్చుకున్న చోట అభివృద్ధి సంపద ఆరోగ్యం అన్నీ ఉంటున్నాయి. ఈ రోజున ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అవి గతంలో మాదిరిగా దశాబ్దాల తరువాత కాదు, వెంటనే అన్ని దేశాలకూ విస్తరిస్తున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే టెక్నాలజీలో తనదైన ఉత్సాహం ప్రోత్సహంతో ముందుకు సాగుతోంది. దీంతో పాటు వివిధ రాష్ట్రాలలో అదే జరుగుతోంది. ఏపీలో సైతం టెక్నాలజీకి పెద్ద పీట వేయాలని దాని ఫలితాలను అందరికీ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. దాంతో ట్రెడిషనల్ ఫార్మెట్ నుంచి పూర్తిగా పక్కకి జరిగి సరికొత్త దారులలో ఏపీ వైద్య ఆరోగ్య రంగం కూడా జోరుగా సాగుతోంది.
డ్రోన్ అంబులెన్స్ లతో :
ఈ రోజున రోడ్డు మార్గాన అంబులెన్సులు నడుస్తున్నాయి. ట్రాఫిక్ లోనే రోగుల ప్రాణాలు పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గోల్డెన్ అవర్ అని అంటారు, ఆ సమయంలో కనుక ఆసుపత్రికి చేర్చితే కచ్చితంగా రోగి బతికేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో డ్రోన్ అంబులెన్స్లను కనుక వినియోగంలోకి తీసుకుని వస్తే కచ్చితంగా గోల్డెన్ అవర్ కి న్యాయం జరుగుతుంది. దీని మీదనే కూటమి ప్రభుత్వ సారధి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. తాజాగా ఆయన డ్రోన్ అంబులెన్స్ ల గురించి ప్రస్తావించారు. త్వరలో ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, 2026 లో డ్రోన్ అంబులెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నామని చంద్రబాబు చేసిన ప్రకటన ఇపుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
రాష్ట్రమంతటా సంజీవని :
ఇక ఏపీ అంతటా సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అని ఆయన అన్నారు. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని బాబు చెబుతూ కుప్పంలో పైలట్ ప్రాజెక్టు అయిందని అన్నారు. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించి రోల్ మోడల్ గా మారుస్తామని చెప్పారు. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు చేయడమే కాకుండా రోగుల డేటా తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ డేటాను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ మానిటరింగ్ చేయడం జరుగుతుందని తద్వారా రోగులకు అవసరమైన చికిత్స సకాలంలో అందే వీలు ఉంటుందని అంటున్నారు.
ఖర్చులే అధికంగా :
వర్తమానంలో వైద్య రంగంలో అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించిపోతున్నాయాని బాబు వ్యాఖ్యానించారు. . రోగి చికిత్స ఖర్చు కంటే రూమ్ ఖర్చే ఎక్కువవుతోందని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రవాసాంధ్రులు అమెరికా నుంచి వర్చువల్ గా ట్రీట్మెంట్ చేసే విధానాన్ని తీసుకుని వస్తామని చెప్పారు. అలాగే ఏపీకి వారు వచ్చినప్పుడు పేషెంట్లకు నేరుగా ట్రీట్ మెంట్ చేసి మెరుగైన వైద్య సేవలకు తగిన సూచనలు చేసేలా ప్రాజెక్టుని రూపకల్పన చెస్తామని అన్నారు.
