రాజమౌళి, సుకుమార్.. చందూ మొండేటికి ఆ ఛాన్స్ ఉందా?
తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన దర్శకుల లిస్ట్ తీసుకుంటే రాజమౌళి, సుకుమార్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
By: M Prashanth | 1 Oct 2026 4:00 PM ISTతెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన దర్శకుల లిస్ట్ తీసుకుంటే రాజమౌళి, సుకుమార్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వాళ్ల తర్వాత కూడా చాలామంది యువ దర్శకులకు భారీ హీరోలు, పెద్ద బడ్జెట్లు వచ్చాయి. కానీ ఒకటి రెండు సినిమాలతోనే దేశవ్యాప్తంగా తమ పేరును బ్రాండ్‌గా మార్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఆ దిశగా వెళ్లే ఛాన్స్ ఉన్న దర్శకుల్లో చందూ మొండేటి పేరు కాస్త సీరియస్‌గా వినిపిస్తోంది.
‘కార్తికేయ 2’తో చందూ ఒక్కసారిగా నార్త్ మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా హిందీలో కూడా క్లిక్ కావడంతో ఆయన పేరు తెలుగు వరకే ఆగలేదు. పైగా ఆ సినిమా బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత ‘తండేల్’తో నాగచైతన్యను పెద్ద స్కేల్‌లో హ్యాండిల్ చేశారు. ఇప్పుడు రానా, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో హిందీ తెలుగు బైలింగ్వల్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.
చందూ దగ్గరకు ఇప్పుడు వచ్చే ప్రాజెక్టుల రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ‘మహాకాల్’ పేరుతో ఉజ్జయిని, శివుడి నేపథ్యం ఉన్న మరో పెద్ద కథపై పని చేస్తున్నారు. అంటే చిన్న కాన్సెప్ట్‌ను పెద్దగా చూపించడం నుంచి, మొదటినుంచే భారీ ప్రపంచాలు ఎంచుకునే స్థాయికి ఆయన వెళ్లారు.
ఇలాంటి టైమ్‌లో ఒకటి రెండు సినిమాలు సరిగ్గా పడితే దర్శకుడి మార్కెట్ హీరోల మార్కెట్‌తో సమానంగా పెరుగుతుంది. రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరు అన్నదానికంటే ముందు ఆయన పేరు వస్తుంది. సుకుమార్ కూడా ‘పుష్ప’ తర్వాత అదే స్థాయిలో నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకున్నారు. చందూ ఇంకా అక్కడికి చేరలేదు. కానీ ఆయన ఎంచుకుంటున్న జోనర్లు, హీరోలు, ప్రొడక్షన్ సెటప్ చూస్తే ఆ రూట్ మాత్రం ఓపెన్‌గా ఉంది.
ముఖ్యంగా ‘మహాకాల్’ సక్సెస్ అయితే లెక్క చాలా మారుతుంది. అక్షయ్ కుమార్, రానా లాంటి ఇద్దరు పెద్ద పేర్లను ఒకే సినిమాలో హ్యాండిల్ చేయడం, హిందీ తెలుగు మార్కెట్లను ఒకేసారి టార్గెట్ చేయడం చిన్న విషయం కాదు. పైగా ఈ కథ కూడా తనదేనని చందూ క్లియర్ చేశారు. అంటే బయట నుంచి వచ్చిన స్టార్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయడం కాదు, తన ఐడియానే పెద్ద సెటప్‌కు తీసుకెళ్తున్నారు.
చందూ దగ్గర ఇప్పుడు కావాల్సింది వరుసగా రెండు బలమైన సినిమాలు. ‘కార్తికేయ 2’ ఇచ్చిన నార్త్ గుర్తింపు, ‘తండేల్’తో వచ్చిన స్కేల్, ఇప్పుడు ‘మహాకాల్’ కాంబినేషన్ ఆయనకు మంచి పొజిషన్ ఇచ్చాయి. ఈ దశలో మరో పాన్ ఇండియా హిట్ పడితే మాత్రం తెలుగు నుంచి నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు చందూ పేరు ఇంకా బలంగా వినిపించడం ఖాయం.
