'సంతాన ప్రాప్తిరస్తు' స్టోరీలో ఊహించని ట్విస్ట్ అదే
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నటి చాందిని చౌదరి మాట్లాడుతూ విక్రాంత్ హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు.
By: Sivaji Kontham | 11 Nov 2025 9:39 AM ISTఅమెరికాలో టెక్ కంపెనీ నిర్వాహకుడు, నటుడు విక్రాంత్ తన కెరీర్ రెండో సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు అనే టైటిల్ తోనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో విక్రాంత్ ఒక ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నాడు. కథానాయికగా తెలుగమ్మాయి చాందిని చౌదరి ప్రధాన ఆకర్షణ.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నటి చాందిని చౌదరి మాట్లాడుతూ విక్రాంత్ హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే సంతాన ప్రాప్తిరస్తు కథలో అసలు ట్విస్ట్ గురించి చాందిని రివీల్ చేయడం ఆసక్తిని కలిగించింది.
చాందిని చౌదరి మాట్లాడుతూ- ''పిల్లలు పుట్టలేదు! అనే సమస్య వచ్చినప్పుడు ఆ భారం ఆడపిల్లలపైనే ఉండేది. మొదటిసారి ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూని డీల్ చేసిన సినిమా ఇది. ఇప్పుడున్న స్ట్రెస్ ఫుల్ లైఫ్ కారణంగా పిల్లలు పుట్టడం సమస్యగా మారుతోంది. ఫర్టిలిటీ సెంటర్లు పిచ్చిగా పెరిగిపోయాయి. పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య పెరగడంతోనే ఇవి పెరిగాయి. జనాలు దీని గురించి తప్పుగా మాట్లాడతారని భార్య భార్తలు బయటపడరు. బయట మాట్లాడితే చులకనగా చూస్తారా? నవ్వుతారా? అనే భయం జంటలో ఉంటుంది. అందుకే ఈ టాపిక్‌పై తక్కువగా మాట్లాడతారు. ఈ పాయింట్ నన్ను ఎక్కువగా ఎగ్జయిట్ చేసింది. ఇలాంటి సినిమాలతో అన్ని విషయాలు బయటకు తెలుస్తాయి.బెడ్ రూమ్ లో విషయం హాల్ (థియేటర్) వరకూ వస్తోంది. ఇలాంటి సినిమా వస్తే ఆ తర్వాత కూడా కొత్త కొత్త పాయింట్లతో సినిమాలొస్తాయి. ఇది ఆశించి నేను ఈ సినిమా చేసాను'' అని అన్నారు.
నన్ను నమ్మి అవకాశం కల్పించినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. అసలు రాజీ అన్నదే లేకుండా నిర్మాతలు ఈ సినిమాని తెరకెక్కించారు. సునీల్ కశ్యప్ - అజయ్ జోడీ సంగీతం పెద్ద ప్లస్. ఈ సినిమాకి పని చేసిన డివోపి, రచయితలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో డైలాగులు బాగా వర్కవుటయ్యాయి. ఆ క్రెడిట్ కళ్యాణ్ గారికి చెందుతుంది. రచయిత షేక్ జావేద్ ఈ కథను ఎంతో అందంగా రాసారు. నా సహనటుడు విక్రాంత్ రెండో సినిమా అయినా చాలా శ్రమించాడు. ఈ సినిమా తర్వాత అతడి వద్దకు మంచి కథలు వస్తాయని అనుకుంటున్నాను. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, మురళీ ధర్ గౌడ్ లాంటి సహనటులు అందరూ అద్భుతంగా నటించారు. నా తండ్రి పాత్రధారి మురళీ గారి నటనకు ప్రశంసలు కురుస్తాయని చాందిని చౌదరి అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో రచయిత మచ్చ రవి, దర్శకులు బాబి, శైలేష్ కొలను తనకు మంచి స్నేహితులు అని, కెరీర్ పరంగా ఉన్నతమైన సలహాలు సూచనలు అందిస్తారని చాందిని చౌదరి వెల్లడించారు. ఒక తెలుగమ్మాయి నటనా రంగంలో రాణించడంపై మచ్చ రవి స్ఫూర్తి దాయకమైన మాటలు ఔత్సాహిక నటీమణులను ఆలోచింపజేసాయని చాందిని ఈ సందర్భంగా అన్నారు.
