హిజ్రా కాన్సెప్టుతో సీక్వెల్ ధైర్యమైన నిర్ణయమే
ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ జంటగా నటించిన `చండీగఢ్ కరే ఆషికీ` చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 29 Jan 2026 11:41 AM ISTఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ జంటగా నటించిన `చండీగఢ్ కరే ఆషికీ` చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, మేకర్స్ రెండో భాగాన్ని ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ సీక్వెల్ గురించి, మొదటి భాగం గురించిన ఆసక్తికర విషయాలు పరిశీలిస్తే, ఈసారి మేకర్స్ కథను కేవలం రిపీట్ చేయకుండా.. కొత్త మలుపులతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొదటి భాగంలో కేవలం ప్రేమకథను చూపించగా, రెండో భాగంలో వివాహం తర్వాత ఎదురయ్యే సామాజిక సవాళ్లు లేదా ఆ సంబంధం గురించి లోతును చర్చించే అవకాశం ఉంది.
మొదటి భాగం కమర్షియల్‌గా ఆశించిన సక్సెస్ సాధించలేదు. సుమారు రూ.38.57 కోట్లు నుండి 41 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. అయితే దాదాపు రూ.40 - రూ.69 కోట్ల భారీ బడ్జెట్ ని దీనికోసం ఖర్చు చేయడంతో, కనీసం పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టలేకపోయింది. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్ర్ గా మిగిలింది.
అయితే ఇది ఫెయిలవ్వడానికి కారణం.. ఈ సినిమా ప్రధానంగా ట్రాన్స్‌జెండర్ రిలేషన్‌షిప్ అంశంపై తెరకెక్కింది. అప్పట్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సామాజికంగా నిషేధంగా భావించే అంశాన్ని ధైర్యంగా స్పృశించినందుకు విమర్శకుల ప్రశంసలు దక్కినా, ఆయుష్మాన్, వాణీల నటనకు మంచి మార్కులు వేసినా కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. నెటిజన్లలో ఒక వర్గం దీనిని LGBTQ ప్రోపగాండా ఫిలింగా అభివర్ణించారు. సున్నితమైన అంశం అప్పట్లో సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు.
ఇప్పుడు సీక్వెల్ ఎందుకు? అంటే సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ఇటీవల మారుతున్న ఆలోచనలు ఇలాంటి కాన్సెప్టును వర్కవుట్ చేస్తాయని భావిస్తున్నారు. గత కొన్ని ఏళ్లలో సామాజిక అంశాల పట్ల ప్రేక్షకుల అవగాహన పెరిగింది. ఓటిటి పుణ్యమా అని ప్రజలు విభిన్నమైన కథలను ఆదరిస్తున్నారు. మొదటి భాగం ఓటిటిలో మంచి వ్యూవర్ షిప్ ని సంపాదించుకోవడంతో, ఈ కథను కొనసాగించడం రిస్క్ కాదని మేకర్స్ భావిస్తున్నారు.
ఆయుష్మాన్ ఖురానా మాటల ప్రకారం..సీక్వెల్ గనుక తీస్తే ఈసారి నిజమైన ట్రాన్స్ గర్ల్ ప్రధాన పాత్రలో ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్టు, గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఇలాంటి కథలను థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొదటి భాగం ఫెయిల్యూర్ అయినా, మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యమైనదే అని చెప్పాలి. హిజ్రాల కోసం అనుకూలమైన చట్టాలు కొన్ని ఉన్నాయి గనుక ఇప్పట్లో ఇలాంటి ఆలోచనతో సినిమా తీస్తే వర్కవుటవుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.
