క్రిస్మస్ బరిలో నెగ్గేదెవరు?
కానీ డెకాయిట్ ఇప్పుడు వాయిదా పడటం వల్ల ఆ డేట్ ను వాడుకోవాలని ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 4:03 PM ISTరిలీజ్ డేట్లు, బాక్సాఫీస్ పోటీలు ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ డేట్ మారితే దాని ప్రభావం మరెన్నో సినిమాలపై పడుతుంది. అయితే ఈసారి క్రిస్మస్ బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు యంగ్ హీరోలు తమ సినిమాలతో పోటీ పడటానికి రెడీ అవుతున్నారు. వాస్తవానికి అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ క్రిస్మస్ కు రిలీజవాల్సింది.
పెళ్లి సందడి2 తర్వాత చాలా గ్యాప్
కానీ డెకాయిట్ ఇప్పుడు వాయిదా పడటం వల్ల ఆ డేట్ ను వాడుకోవాలని ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. వారే మేక రోషన్ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీరిద్దరూ ఒకే రోజున తమ సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధపడుతున్నారు. హీరో శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్ నుంచి పెళ్లి సందడి2 తర్వాత ఎలాంటి సినిమా రాలేదు.
డిసెంబర్ 25న ఛాంపియన్
ఇప్పుడు ఛాంపియన్ అనే సినిమాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రోషన్ పుట్టినరోజు నాడు స్వప్న సినిమాస్ అనౌన్స్ చేసింది. అనేశ్వర రాజన్ అనే మలయాళ నటి ఛాంపియన్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. డిసెంబర్ 25న ఛాంపియన్ రిలీజ్ కానుండగా, ఈ సినిమాపై అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
క్రిస్మస్ కు రానున్న టైసన్ నాయుడు
అదే రోజున బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన టైసన్ నాయుడు కూడా రిలీజ్ కానుంది. టైసన్ నాయుడు షూటింగ్ ఆఖరి దశలో ఉంది. డెకాయిట్ పోస్ట్‌పోన్ అయ్యాక డిసెంబర్ 25న ఛాంపియన్ మాత్రమే రిలీజవుతుందనుకున్నారు కానీ ఇప్పుడు రెండు సినిమాలూ డైరెక్ట్ గా పోటీ పడనుండటం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలు ఆయా స్టార్ల కెరీర్లో చాలా కీలకం. రోషన్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సి ఉండగా, కిష్కింధపురితో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో క్రిస్మస్ బరిలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
