'సల్లం గుండాలే' సాంగ్.. చంద్రబోస్ మరో సర్ప్రైజ్!
'సల్లం గుండాలే.. సల్లం గుండాలే.. పెండ్లి చేసుకుని నువ్వు పైలంగా ఉండాలే..' అంటూ సాగుతున్న సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది.
By: M Prashanth | 11 Dec 2025 9:36 AM IST'సల్లం గుండాలే.. సల్లం గుండాలే.. పెండ్లి చేసుకుని నువ్వు పైలంగా ఉండాలే..' అంటూ సాగుతున్న సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్ మూవీలోని ఆ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.
డిసెంబర్ 25న థియేటర్స్ లో ఛాంపియన్ మూవీ రిలీజ్ అవ్వనుండగా.. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే జోష్ తో మేకర్స్ మంగళవారం రెండో పాట సల్లం గుండాలేను విడుదల చేశారు. దాన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా, రితేష్ జి రావ్, మనీషా ఈరబత్తిని కలిసి సాంగ్ ను ఆలపించారు.
ముఖ్యంగా.. సాంగ్ లో లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సల్లం గుండాలే.. సల్లం గుండాలే.. పెండ్లి చేసుకుని నువ్వు పైలంగా ఉండాలే.. పిల్లా పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే.. నవ్వుతూ నువ్వుంటే నిన్ను ఇట్ట సూత్తాంటే కట్టాలల్లా, కన్నీళ్లల్లా ఎంతో సంబురం.. అంటూ ఆస్కార్ విన్నింగ్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ పై చంద్రబోస్ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా వీడియో మెసేజ్ ను రిలీజ్ చేశారు. సల్లం గుండాలే సాంగ్ విడుదలై మంచి ఆదరణను అందుకుంటోందని, అభిమానాన్ని కూడా నోచుకుంటోందని తెలిపారు. ఆ పాట రాస్తున్నప్పుడే తనకు చాలా సంతృప్తి లభించిందని చంద్రబోస్ తెలిపారు.
ఆ తర్వాత పాటకు తాను రాసిన లిరిక్స్ కోసం క్లుప్తంగా వివరించారు. సాంగ్ లోని ప్రతీ పదం.. కవితాత్మక ప్రతీకలుగా వర్ణించారు. ముఖ్యంగా ఛాంపియన్ మూవీలోని కీలకమైన సన్నివేశంలో ఆ పాట వస్తుందని సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. అందరూ ఆదరించాలని, విన్నదాని కన్నా చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుందని హామీ ఇచ్చారు.
అయితే చంద్రబోస్ మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. సాంగ్ అదిరిపోయిందని అంతా చెబుతున్నారు. ఇప్పుడు కీలక సీన్ లో పాట వస్తుందని చంద్రబోస్ చెప్పడంతో.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు. చంద్రబోస్ లిరిక్స్ తో పాటు రోషన్, అనస్వర రాజన్ జోడీ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. మరి సినిమాలో సల్లం గుండాలే సాంగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.
