Begin typing your search above and press return to search.

పాటను పరుగులు పెట్టించిన స్వర చక్రవర్తి

అసలు పేరు అప్పారావు. వెండి తెర పేరు చక్రవర్తి. ఎవరు పెట్టారో తెలియదు కానీ వెండి తెరను స్వర చక్రవర్తిగా రెండు దశాబ్దాల పాటు ఏలాడు.

By:  Satya P   |   8 Sept 2025 8:00 PM IST
పాటను పరుగులు పెట్టించిన స్వర చక్రవర్తి
X

అసలు పేరు అప్పారావు. వెండి తెర పేరు చక్రవర్తి. ఎవరు పెట్టారో తెలియదు కానీ వెండి తెరను స్వర చక్రవర్తిగా రెండు దశాబ్దాల పాటు ఏలాడు. దాదాపుగా వేయి సినిమాల దాకా సంగీత దర్శకత్వం వహించి కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు.క్లాస్ మాస్ ని ఉర్రూతలూగించిన చక్రవర్తి తెలుగు సినిమా పాటకు కమర్షియల్ ఒరవడి నేర్పాడు. అందరూ చాలా ఈజీగా పాడుకునేలా పాట నడక మార్చేశాడు. అందుకే ఆయనను తెలుగు సినిమా పాటలకు ఎపుడూ ఎపుడూ చక్రవర్తిగానే అభివర్ణించాలి.

గాయకుడు కావాలని వచ్చి :

ఇక విషయానికి వస్తే గుంటూరు జిల్లాకు చెందిన కొమ్మినేని అప్పారావు 1936 సెప్టెంబర్ 8న పుట్టారు. చిన్ననాటి నుంచే సంగీతం మీద మమకారం ఉంది. అందుకే యుక్త వయసు రాగానే సినీ సీమ వైపే అడుగులు పడ్డాయి. గాయకుడు కావాలని తపనతో మద్రాస్ చేరిన చక్రవర్తి అప్పటికే లబ్ద ప్రతిష్టులు అయిన దిగ్గజ గాయకులు ఘంటసాల వారి వద్ద కొంతకాలం శిష్యరికం చేశారు. పరమానందయ్య శిష్యుల కధ వంటి చిత్రాలలో కోరస్ తో కలిసి గొంతు కలిపాడు. అలా పాటల కోసం ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతున్న క్రమంలో గాయకుడుగా అవకాశాలు అయితే పెద్దగా రాలేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

సతీమణి ఇచ్చిన సలహాతో :

అయితే అనూహ్యంగా ఆయనకు సంగీత దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. 1971లో మూగ ప్రేమ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆయనను తీసుకున్నారు అయితే గాయకుడు కావాలా మ్యూజిక్ డైరెక్షన్ చేయాలా అన్న మీమాంసలో ఉన్న చక్రవర్తికి భార్య సంగీత దర్శకత్వం వైపే వెళ్ళమని ఇచ్చిన సలహా మొత్తం జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు ఆయనకు కూడా తెలియదు తాను తెలుగు సినీ సీమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏలుతాను అని. అంతే కాదు తెలుగు సినిమా పాటకు పరుగులు నేర్పించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాను అని. మూగ ప్రేమ తరువాత ఆయనకు అవకాశాలు తగ్గినా శోభన్ బాబు హీరోగా వచ్చిన శారద చిత్రం మేలి మలుపు తిప్పింది. ఆ సినిమాలో పాటలు అన్నీ సూపర్ హిట్ కావడంతో తెలుగు సీమలో చక్రవర్తి శకం స్టార్ట్ అయింది.

హీరోలను స్టార్లు చేశారు :

ఒక సినిమాలో ఆరు పాటలు ఉంటే ఆరూ సూపర్ హిట్ చేసిన ఘనత చక్రవర్తికే దక్కింది. ఎంతో మంది హీరోలకు ఆయన లైఫ్ ఇచ్చారు అన్నది అక్షర సత్యం. కొత్తగా సినీ సీమకు వచ్చిన వారంతా చక్రవర్తి పాటతో టాప్ హీరోలు అయిపోయారు. మూడు నాలుగు జనరేషన్ స్టార్ హీరోలతో పనిచేసిన రికార్డు చక్రవర్తి సొంతం. ఆయన ప్రతిభకు ఆకాశమే హద్దు అని చెప్పాలి. ఒక గీతానికి బాణీ కట్టడంలో చక్రవర్తి స్పీడ్ ని ఎవరూ అందుకోలేరు అని చెబుతారు. కేవలం నాలుగైదు నిమిషాల్లో బాణీలు కట్టి ఈ రోజుకీ సూపర్ హిట్ పాటలు గా చేసిన రికార్డు ఆయనకే ఉంది.

కారులో కట్టిన బాణి :

అప్పట్లో మల్లెపువ్వు శోభన్ బాబు హీరోగా ఒక మ్యూజికల్ హిట్ మూవీ వచ్చింది. ఆ చిత్రంలోని పాటలు అన్నీ క్లాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. అందులో ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉన్న చిన్న మాట ఒక చిన్న మాట సాంగ్ కి ఇంటి నుంచి స్టూడియోకు వెళ్ళే దారిలో కారులోనే బాణి కట్టేసిన స్వర చక్రవర్తి ఆయన అని చెప్పుకుంటారు. ఏఎన్నార్ సినీ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ అయిన ప్రేమాభిషేకం పాటలను ఆయన కొన్ని రాత్రులు అన్నపూర్ణ స్టూడియోలో ఉండి మరీ అద్భుతమైన బాణీలు కట్టారు. పగలు అంతా మద్రాస్ స్టూడియోలలో బిజీగా ఉంటూ రాత్రికి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి తెల్లవారు జాము వరకూ ఆ సినిమా మ్యూజిక్స్ సిటింగ్స్ లో పాలు పంచుకునేవారు. అందులో ఉన్న మొత్తం ఎనిమిది దాకా పాటలకు ఏకంగా అరవై ట్యూన్లు ఇచ్చి అక్కినేని వారిని పూర్తి సంతృప్తి పరచిన మీదటనే అందులో నుంచి నచ్చినవి ఎన్నుకున్నారని చెబుతారు.

చెక్కు చెదరదని రికార్డు :

ఈ రోజుకీ చక్రవర్తి పేరు మీద చెక్కు చెదరని రికార్డు ఉంది. 1989లో మొత్తం సినిమాలు 95 దాకా రిలీజ్ అయితే అందులో 66 సినిమాలు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినవే అంటే ఆయన ఎంత పని రాక్షసుడో అర్ధం అవుతుంది. ఆయన ఎంతో మంది శిష్యులను సినీ సీమకు అందించారు. చక్రవర్తిలో లేనిది గర్వం. ఉన్నది పాటల మీద వ్యామోహం. అదే ఆయనను అంత పైకి తీసుకుని వచ్చింది. తెలుగు సినిమా రంగం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే. ఈ రోజున వస్తున్న పాటలు చూస్తే ఎవరికీ గుర్తే ఉండవు. కానీ నలభై యాభై ఏళ్ళ క్రితం కట్టిన పాటలు నేటికీ జనాలు పాడుకుంటున్నారు అంటే ఆ గొప్పదనం నిజంగా అయనకే దక్కుతుంది. చక్రవర్తి జయంతి అయిన ఈ రోజు ఆయనకు సినీ సంగీత ప్రియులు అంతా ఘన నివాళి అర్పిస్తున్నారు.