Begin typing your search above and press return to search.

'సంక్రాంతి తప్ప వేరే డేట్ కనపడలేదా?'

సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది నిర్మాత నిర్ణయం. కానీ ఆ తేదీని ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తే ఎలా ఉంటుంది.

By:  M Prashanth   |   22 Oct 2026 9:53 AM IST
సంక్రాంతి తప్ప వేరే డేట్ కనపడలేదా?
X

సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది నిర్మాత నిర్ణయం. కానీ ఆ తేదీని ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తే ఎలా ఉంటుంది. యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' (SYG) నిర్మాత చైతన్య రెడ్డి విషయంలో అదే జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి వస్తున్నామని ప్రకటించినందుకు ఆమెకు ఫోన్లు చేసి, రిలీజ్ డేట్ ను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారట.

అంతేకాదు.. జనవరి 12న ఎలా సినిమా విడుదల చేస్తారో చూస్తామని కూడా బెదిరించారట. 'సంక్రాంతి తప్ప వేరే డేట్ కనపడలేదా? జనవరి 12న ఎలా వస్తారు? ఆ రోజు కోసం ఎందుకు ప్రకటించారు? ఎలా విడుదల చేస్తారో చూస్తాం' అంటూ తనకు ఫోన్లు వచ్చినట్లు రీసెంట్ గా చైతన్య రెడ్డి రివీల్ చేశారు. విడుదల తేదీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పినట్లు తెలిపారు.

నిర్మాత నిరంజన్ రెడ్డికి ఫోన్ చేయడానికి కొందరు భయపడతారని, ఆయన గట్టిగా సమాధానం చెబుతారని ఆమె పేర్కొన్నారు. అందుకే తాను చెబితే వింటారనే ఉద్దేశంతో తనకు ఫోన్ చేశారని వెల్లడించారు. సాధారణంగా పెద్ద సినిమాల విడుదల తేదీల విషయంలో పోటీ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి లాంటి పండుగ సమయంలో ఆ పోటీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీజ న్‌లో సినిమాలను విడుదల చేస్తే సెలవుల కారణంగా ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే పెద్ద హీరోల సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలవాలని చూస్తుంటాయి. అయితే ఎక్కువ సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల కోసం పోటీ తప్పదు. ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి, ఏ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది, ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందనే విషయాలు కీలకంగా మారతాయి. ఆ కారణంగానే సంక్రాంతి విడుదల తేదీల చుట్టూ ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది.

కానీ మరో మూవీ వస్తుందని తమ విడుదల తేదీని మార్చుకోవాలంటూ నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక 'సంబరాల ఏటి గట్టు' విషయానికి వస్తే.. సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. 'హను-మాన్'తో భారీ విజయాన్ని అందుకున్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.

అయితే మూవీ టీమ్ ప్రకటించిన ప్రకారం ఈ సినిమా 2027 జనవరి 12న విడుదల కావాలి. అయితే ఆ తేదీని ప్రకటించినప్పుడే బెదిరింపులు వచ్చినట్లు చైతన్య రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి అనౌన్స్ చేసిన తేదీకి సినిమా రానుందా? సంక్రాంతి పోటీలో నిలబడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి. ఏదేమైనా సినిమాల మధ్య పోటీ కామనే. కానీ ఎవరి మూవీ ఎప్పుడు రావాలనేది బెదిరింపులతో కాకుండా, నిర్మాతల నిర్ణయం ప్రకారమే ఉండాలనే అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.