చాయ్ వాలా: ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ కందుకూరి మాట్లాడుతూ "థియేటర్‌లో వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లే చిత్రాలే హిట్ అవుతాయి.
By: M Prashanth | 20 Aug 2025 10:08 PM ISTటాలీవుడ్‌లో సెన్సిబుల్ సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకుల కోసం వస్తోన్న కొత్త చిత్రం చాయ్ వాలా. యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించిన ఈ సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
"నా చాయ్ విలువ రూ.15.. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది" అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ ఆరంభం కావడం అందరినీ ఆకట్టుకుంది. శివ కందుకూరి చెప్పిన లైన్, "ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాస్ అయిపోయేవాళ్లం కదరా" అని చెప్పడం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, లవ్ ట్రాక్, యూత్ కనెక్ట్ కలగలిపి చూపించిన ఈ టీజర్ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ కందుకూరి మాట్లాడుతూ "థియేటర్‌లో వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లే చిత్రాలే హిట్ అవుతాయి. చాయ్ వాలా చూసిన తరువాత ఎమోషన్‌తో బయటకు వస్తారు. శివ, రాజీవ్ కనకాల, తేజు అశ్వినీ లాంటి నటీనటులు అద్భుతంగా చేశారు" అన్నారు. ఆయనతో పాటు టీమ్‌కి సంబంధించిన ఇతరులు కూడా సినిమా పట్ల నమ్మకం వ్యక్తం చేశారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ "చాయ్ వాలా టీమ్‌తో నాకు మంచి బంధం ఏర్పడింది. ఈ సినిమా చూసిన తర్వాత తండ్రితో తప్పక మాట్లాడాలని అనిపిస్తుంది. రాజీవ్ కనకాల గారితో పనిచేయడం నాకు లైఫ్‌లో గుర్తుండిపోతుంది. తేజు అశ్వినీ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. మా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ "ప్రతీ మనిషి జీవితంలో జరిగే సంఘటనలే మా సినిమాలో ఉంటాయి. శివ ఈ కథకు సరైన ఫేస్ అని అనిపించింది. అందుకే ఆయనకే కథ చెప్పాను" అన్నారు. నిర్మాత వెంకట్ పాపుడిప్పు మాట్లాడుతూ "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అని అంటారు. కానీ సినిమా చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. కొన్ని సీన్లు చూడగానే నా కంట నీళ్లు వచ్చాయి" అని ఎమోషనల్ అయ్యారు.
రాజీవ్ కనకాల, తేజు అశ్వినీ, రాజ్ కుమార్ కసిరెడ్డి వంటి నటీనటులు కూడా చాయ్ వాలా కథ, దర్శకత్వం, టెక్నికల్ టీమ్‌ను ప్రశంసించారు. ప్రత్యేకంగా రాజీవ్ కనకాల "శివ ఆకలితో ఉన్న ఆర్టిస్ట్, ఎంతో ఎత్తుకు వెళ్లాలి" అని చెప్పడం హైలైట్ అయ్యింది. డీఓపీ క్రాంతి అందించిన విజువల్స్, రైటర్ ఇమ్రాన్ రాసిన డైలాగులు సినిమాకు బలమైన పాయింట్స్ అని టీమ్ పేర్కొంది. త్వరలోనే థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది.
