Begin typing your search above and press return to search.

కేంద్రం సరికొత్త పాలసీ: ఇకపై నిర్మాతలకు సులభంగా బ్యాంక్ ఫైనాన్స్?

సినిమా తీయాలనే ఉత్సాహం.. మంచి కథ, నైపుణ్యం ఉన్నా పెట్టుబడులు సకాలంలో దొరకక... దొరికినా భారీ వడ్డీల భారం భరించలేక ఎంతోమంది నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By:  Sivaji Kontham   |   1 July 2026 10:50 PM IST
కేంద్రం సరికొత్త పాలసీ: ఇకపై నిర్మాతలకు సులభంగా బ్యాంక్ ఫైనాన్స్?
X

చిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య `ఫిల్మ్ ఫైనాన్సింగ్` (సినిమా పెట్టుబడులు). సినిమా తీయాలనే ఉత్సాహం.. మంచి కథ, నైపుణ్యం ఉన్నా పెట్టుబడులు సకాలంలో దొరకక... దొరికినా భారీ వడ్డీల భారం భరించలేక ఎంతోమంది నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ‌స్ట్రీకి ప్ర‌యివేట్ ఫైనాన్సింగ్ అనేది పెద్ద హెడేక్. ఇటీవ‌లే దిల్ రాజు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు ఫైనాన్స్ పై 36శాతం వ‌డ్డీ క‌ట్టేవార‌ని, ఇప్పుడు నెమ్మ‌దిగా 24 శాతానికి (రూ.2 వ‌డ్డీ)కి చేరుకుంద‌ని చెప్పారు. అయితే ఇది కూడా చాలా పెద్ద వ‌డ్డీ. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త పాలసీని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. చిత్రనిర్మాతలకు బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ సులువయ్యేలా చేయడం, ప్రత్యామ్నాయ పెట్టుబడి వ్యూహాలను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తోంది.

ప్రముఖ సినీ గేయరచయిత, సెన్సార్ బోర్డు మాజీ అధినేత ప్రసూన్ జోషి సారథ్యంలో కేంద్రం ఈ కొత్త పాలసీపై కసరత్తు ప్రారంభించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యేక ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారని కూడా తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ).. నిర్మాణ రంగ నిపుణులను ఈ ప్యానెళ్లలోకి ఎంపిక చేయనున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, క్యాపిటల్ (పెట్టుబడి) మార్కెట్‌ను క్రమబద్ధీకరించి, నిర్మాతలకు ఇనిస్టిట్యూషనల్ ఫండింగ్ (సంస్థాగత పెట్టుబడులు) లభించేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్ర‌త్యేక విధానాన్ని రూపొందించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక కేంద్ర ప్యానెల్‌లోకి టాలీవుడ్ (తెలుగు చిత్రసీమ) నుండి ఎవరు భాగస్వామ్యం వహిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగు పరిశ్రమ నుండి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తే ఇక్కడి బిజినెస్ సమీకరణాలపై పూర్తి అవగాహన ఉన్న అగ్ర నిర్మాత- తెలంగాణ ఎఫ్‌డీసీ (FDC) అధ్యక్షుడు దిల్ రాజు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు వంటి ప్రముఖుల పేర్లను ప‌రిగ‌ణించే వీలుంటుంద‌ని ఒక అంచ‌నా. థియేటర్ల వ్యవస్థ, పంపిణీ, నిర్మాణ రంగాలపై పట్టున్న వీరిలో ఎవరిని ఈ ప్యానెల్‌లోకి కేంద్రం ఆహ్వానిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రతి ఏటా వందల, వేల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు నిర్మితమవుతున్నాయి. అయితే ఈ సినిమాల ఫైనాన్సింగ్ కోసం నిర్మాతలు తమ వ్యక్తిగత ఆస్తులను, ఇళ్లను తణఖా పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే.. ఆ వడ్డీల భారం తట్టుకోలేక నిర్మాతలు రోడ్డున పడే ప్రమాదం ఉంటోంది. కేంద్రం తీసుకురాబోయే కొత్త పాలసీ ద్వారా ఆస్తుల తణఖా వంటి కష్టాలు లేకుండా, కేవలం స్క్రిప్ట్ విలువ, ప్రాజెక్ట్ నమ్మకత్వాన్ని బట్టి బ్యాంకులు నేరుగా రుణాలు ఇచ్చేలా సులభతరమైన మార్గాన్ని అన్వేషిస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

నిర్మాతను ఆర్థికంగా రోడ్డున పడేయకుండా కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపైనా ఈ కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించనుందని ప్ర‌సూన్ జోషి వంటి ప్ర‌ముఖులు వెల్ల‌డిస్తున్నారు. కంటెంట్ క్రియేషన్‌కు పెద్దపీట వేస్తూ... సినిమా ప్రొడక్షన్ - డిస్ట్రిబ్యూషన్ కోసం నిధులు సేకరించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీ ద్వారా నిర్మాతల‌కు బ్యాంకు నిధులు ఇప్పించే పూచీని (గ్యారంటీ) తీసుకుంటే అది భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా భారీ పెట్టుబడులతో నడిచే టాలీవుడ్‌కు ఒక పెద్ద ఊరటగా మారుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే ఇది ఇంకా ప‌రిశీల‌న ద‌శ‌లో ఉంది. దీనిపై అధ్య‌య‌నానికి ఒక క‌మిటీ ప‌ని చేస్తోంది. సినిమా రంగం అభివృద్ధిపై ఇటీవ‌లి కాలంలో కేంద్రం కొంత మేర అద‌న‌పు దృష్టి సారిస్తోంది. క‌మిటీలు వేసి అధ్య‌య‌నాలు చేయిస్తోంది. గ్లోబ‌ల్ వ‌ర‌ల్డ్ లో భార‌తీయ సినిమా ఎద‌గాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆకాంక్షించ‌డం స్ఫూర్తిదాయ‌క‌మైన‌ది.