కేంద్రం కొత్త పాలసీ: ఇకపై టైర్ 2, టైర్ 3 సిటీల్లో థియేటర్ల జాతర!
భారతీయ సినిమాలో ఎగ్జిబిషన్ (థియేటర్ల) రంగానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఊపునిచ్చేందుకు ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది.
By: Sivaji Kontham | 1 July 2026 12:17 AM ISTభారతీయ సినిమాలో ఎగ్జిబిషన్ (థియేటర్ల) రంగానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఊపునిచ్చేందుకు ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా థియేటర్ల సంఖ్యను, స్క్రీన్ కౌంట్‌ను భారీగా పెంచేలా కేంద్రం సరికొత్త ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సినిమా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం `మోడల్ స్టేట్ సినిమా రెగ్యులేషన్స్` ను తీసుకువచ్చింది. ఈ నూతన ఏకీకృత విధానం ద్వారా దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇకపై సరికొత్త థియేటర్లు వెలిసేందుకు - సినిమా మార్కెట్ ఊహించని రీతిలో అభివృద్ధి చెందేందుకు కేంద్రం ఒక పక్కా ప్రణాళికను ప్రకటించింది.
ప్రస్తుతం భారతదేశంలో సినిమా థియేటర్ల నియంత్రణ, లైసెన్సింగ్ నిబంధనలు అనేవి పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ఒక్కో రాష్ట్రంలో థియేటర్ల అనుమతుల కోసం వేర్వేరు నిబంధనలు అమల్లో ఉన్నాయి. సింగిల్ విండో సిస్టమ్ లేకపోవడం, సుదీర్ఘమైన అనుమతుల ప్రక్రియ వంటి ఎన్నో లీగల్ గందరగోళాలు ఉన్నాయి. ఈ సంక్లిష్టమైన రూల్స్ కారణంగానే కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లు లేదా సరికొత్త స్క్రీన్ల స్థాపన కేవలం మెట్రో నగరాలకే పరిమితమైపోయింది. ఈ గందరగోళం వల్ల చిన్న పట్టణాలు (టైర్ 2, టైర్ 3) , గ్రామీణ ప్రాంతాలలో థియేటర్ల రంగ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ లోటును భర్తీ చేయడానికే కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుమతుల ప్రక్రియను పూర్తిస్థాయిలో సింప్లిఫై చేసేస్తోంది.
ఈ కొత్త మోడల్ నిబంధనల ద్వారా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీనివల్ల చిన్న నగరాల్లో కూడా సరికొత్త సింగిల్ స్క్రీన్లు, మినీ థియేటర్ల స్థాపనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. థియేట్రికల్ మార్కెట్ మరింత విస్తరించడం ద్వారా స్థానిక క్రియేటర్లకు, చిన్న సినిమాలకు భారీగా స్క్రీన్లు దొరుకుతాయి. అయితే కేంద్రం తెస్తున్న ఈ నూతన మోడల్ నిబంధనలతో పాటు, క్షేత్రస్థాయిలో ఉన్న కఠిన వాస్తవాలను కూడా గమనించాల్సి ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వందలాది సినిమా థియేటర్లు కలెక్షన్లు లేక, మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేక పూర్తిగా మూతపడిపోయాయి.
గత కొన్నేళ్లుగా ఓటీటీల ప్రభావం, అధిక జీఎస్టీ, కరెంట్ ఛార్జీల భారం వల్ల మూతపడిన చాలా సినిమా థియేటర్లు.. కళ్యాణమండపాలుగా మారిపోగా, మరికొన్ని సూపర్ మార్కెట్లుగా లేదా ఇతర కమర్షియల్ వ్యాపార సముదాయాలుగా రూపాంతరం చెందాయి. ఈ విధంగా థియేటర్ల వ్యవస్థ అంతరించిపోకుండా ఉండాలంటే కేవలం అనుమతులు సులభతరం చేస్తే సరిపోదు.. కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానంలో.. సబ్సిడీల పరంగా గట్టి సహాయం అందించాల్సి ఉంటుంది. కళ్యాణమండపాలుగా మారిన పాత థియేటర్లను మళ్లీ సినిమా హాళ్లుగా పునర్నిర్మించేలా ఔత్సాహిక ఎగ్జిబిటర్లకు ప్రత్యేక ప్యాకేజీలు లేదా తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణాలు అందించాల్సిన అవసరం ఉంది.
అంతేకాకుండా.. థియేటర్ల మనుగడకు అత్యంత కీలకమైన పన్నుల విధానంలో కేంద్రం కొన్ని రాయితీలు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమా టికెట్లపై ఉన్న జీఎస్టీ స్లాబులను మరింత తగ్గించడం ద్వారా ప్రేక్షకులకు టికెట్ ధరల భారం తగ్గుతుంది. అలాగే థియేటర్ల విద్యుత్ వినియోగాన్ని కమర్షియల్ కేటగిరీ నుండి మార్చి.. పరిశ్రమల కేటగిరీ కింద రాయితీలు ఇస్తే సింగిల్ స్క్రీన్ల యజమానులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. కేంద్రం తెచ్చిన ఈ కొత్త మోడల్ రెగ్యులేషన్స్‌ను బేస్ చేసుకుని, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల సడలింపులపై కూడా దృష్టి పెడితేనే.. థియేటర్ల రంగానికి పూర్వవైభవం వచ్చి టైర్ 2 - టైర్ 3 పట్టణాలు మళ్లీ వెండితెర వెలుగులతో కళకళలాడుతాయి. అయితే తెలుగు రాష్ట్రాల థియేటర్ల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలో మన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కేంద్ర కమిటీకి దీనిని నివేదించాల్సి ఉంటుంది. ప్రాంతీయంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎలాంటి కలతలు ఉన్నా కలిసి కట్టుగా కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబడితేనే బావుంటుంది!
