Begin typing your search above and press return to search.

డిజిటల్ సినిమా పైరసీపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తున్న డిజిటల్ పైరసీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

By:  Sivaji Kontham   |   28 July 2026 9:09 AM IST
డిజిటల్ సినిమా పైరసీపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తున్న డిజిటల్ పైరసీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఆన్‌లైన్‌లో సినిమాలను అక్రమంగా పైర‌సీలో ప్రసారం చేయడం వల్ల చిత్ర పరిశ్రమ రూ. కోట్లలో నష్టపోతోందని గుర్తించిన ప్రభుత్వం దీనిని అరికట్టడానికి చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేసింది. సినిమా రంగానికి చెందిన హక్కులదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.

సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం 2023 ద్వారా పైరసీ కంటెంట్‌ను ప్రసారం చేసే ఇంటర్మీడియరీలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన రక్షణ కల్పించారు. ఈ చట్టం ఆధారంగా పైరసీ ఫిర్యాదులను పరిష్కరించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేకమైన సంస్థాగత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా డిజిటల్ మాధ్యమాల్లో పైరసీ అరికట్టడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోంది.

బాధ్యులపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా..వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు ఏకంగా 7393 పైరసీ యుఆర్‌ఎల్‌ (URL)లను కేంద్ర మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. వీటిలో 1263 పైరసీ వెబ్‌సైట్‌లు, 4,996 టెలిగ్రామ్ ఛానెళ్లు ఉన్నాయి. పైరసీ కంటెంట్ ఎక్కువగా ప్రచారమయ్యే సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్ ఛానెళ్లపై దృష్టి సారించి వాటిని తొలగించడం ద్వారా పరిశ్రమకు ఉపశమనం లభిస్తోంది.

ఈ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ఒక `అంతర్-మంత్రిత్వ శాఖల కమిటీ`ని ఏర్పాటు చేసింది. దీనికి తోడు పైరసీ ఫిర్యాదులను ఒకే చోట స్వీకరించి సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక `యాంటీ-పైరసీ పోర్టల్` ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే అవకాశం ఏర్పడనుంది.

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ విషయాలను స్పష్టం చేస్తూ.. సినీ పరిశ్రమలోని అన్ని సాంకేతిక శాఖ‌ల‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిజిటల్ వేదికల్లో కంటెంట్ చోరీని అరికట్టడానికి, నిర్మాతలు, పంపిణీదారుల హక్కులను కాపాడటానికి భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కఠినమైన చర్యలను కొనసాగిస్తుందని స్పష్టమవుతోంది.