Begin typing your search above and press return to search.

ఇండియాలో హిట్.. అధర్ కంట్రీస్ లో ఫట్.. అనిపించుకున్న చిత్రాలు ఇవే!

గల్ఫ్ దేశాల నుంచి పాకిస్థాన్ వరకు మన క్రేజీ సినిమాలకు నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   7 April 2026 6:00 PM IST
ఇండియాలో హిట్.. అధర్ కంట్రీస్ లో ఫట్.. అనిపించుకున్న చిత్రాలు ఇవే!
X

మన దేశంలో ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురుస్తుందని అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు భారత్‌లో వందల కోట్లు రాబట్టినా, విదేశీ గడ్డపై మాత్రం అడుగు పెట్టలేకపోయాయి. అశ్లీలత, మతపరమైన అంశాలు లేదా పొరుగు దేశాలతో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా కొన్ని దేశాలు మన సినిమాలను బ్యాన్ చేశాయి. గల్ఫ్ దేశాల నుంచి పాకిస్థాన్ వరకు మన క్రేజీ సినిమాలకు నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..

గల్ఫ్ దేశాల్లో గండం.. 'ధురందర్', 'ఫైటర్'పై వేటు:

తాజాగా రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురందర్' చిత్రంపై గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి. యాంటీ పాకిస్థాన్ కంటెంట్ ఉందన్న కారణంతో సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఆరు దేశాలు దీనిని అడ్డుకున్నాయి. ఐతే మన ఇండియాలో ఇప్పటికే రిలీజ్ ఐన ధురంధర్ 2 మూవీ 1300 కోట్లు దిశగా దూసుకుపోతూ, సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది. ఇక అంతకుముందు హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్', జాన్ అబ్రహం 'ది డిప్లొమాట్' చిత్రాలకు కూడా ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి. సరిహద్దు గొడవలు, మిలిటరీ ఆపరేషన్ల నేపథ్యంలో సాగే కథలు వారి సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

మతపరమైన సున్నితత్వం.. 'ఓ మై గాడ్', 'విశ్వరూపం':

భారత్‌లో మతపరమైన అంశాలపై చర్చ లేపిన 'ఓ మై గాడ్' సినిమాను మధ్యప్రాచ్య దేశాలు నిరాకరించాయి. దేవుడి ఉనికిని ప్రశ్నించడం, దొంగ బాబాల గురించి చూపించడం అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని భావించాయి. ఇంతేకాక కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం' కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని వర్గాలను కించపరిచేలా ఉందన్న ఆరోపణలతో ఈ సినిమాపై పలు దేశాల్లో బ్యాన్ విధించారు. మన దగ్గర క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాలు విదేశీ ప్రేక్షకులకు మాత్రం దూరం అయ్యాయి.

సంస్కృతి పేరుతో అడ్డుకట్ట.. 'ప్యాడ్ మ్యాన్', 'ది కేరళ స్టోరీ':

మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించే 'ప్యాడ్ మ్యాన్' సినిమాను పాకిస్థాన్ నిషేధించింది. బహిష్టు సమయంలో వాడే న్యాప్‌కిన్ల గురించి మాట్లాడటం తమ సంప్రదాయాలకు విరుద్ధమని అక్కడి సెన్సార్ బోర్డు వింత కారణం చెప్పింది. ఇక తీవ్రవాద ఇతివృత్తంతో వచ్చిన 'ది కేరళ స్టోరీ'కి కూడా విదేశాల్లో గట్టి సెన్సార్ ఎదురైంది. మత మార్పిడుల అంశం వివాదాస్పదం కావడంతో గల్ఫ్ దేశాల్లో దీనిని విడుదల చేయనివ్వలేదు. ఇలా ఎన్నో హిట్ సినిమాలు సరిహద్దులు దాటలేక బాక్సాఫీస్ వద్ద నష్టపోయాయి.

సెన్సార్ నిబంధనల సంకెళ్లు:

ఇక సినిమా అనేది ఒక కళారూపం అయినప్పటికీ, దేశాల మధ్య ఉండే రాజకీయ, సామాజిక పరిస్థితులు దానిపై ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. మన దేశంలో గొప్ప సందేశాన్ని ఇచ్చిన చిత్రాలు కూడా, ఇతర దేశాల చట్టాలు మరియు సంస్కృతి దృష్ట్యా అక్కడ విడుదలకు నోచుకోవడం లేదు. ఇక క్రియేటివ్ ఫ్రీడమ్ మరియు సెన్సార్ నిబంధనల మధ్య జరిగే ఈ పోరాటంలో అప్పుడప్పుడు ఇలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఏదేమైనా మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం.