సెన్సార్ షాక్.. ఇకపై అలా కుదరదు
మారుతున్న కాలానికి తగ్గట్లు లిబరల్‌గా ఉండాల్సింది పోయి.. ఇంకా సంకుచితంగా వ్యవహరిస్తున్నారంటూ సెన్సార్ బోర్డు మీద మండిపడుతున్నారు.
By: Garuda Media | 11 Aug 2026 11:39 PM ISTఇప్పటికే సెన్సార్ బోర్డు తీరు పట్ల అనేక విమర్శలు ఉన్నాయి. రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కండిషన్లు పెడుతూ సినిమాలను చంపేస్తున్నారని.. ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన విధానం పాటిస్తున్నారని ఫిలిం మేకర్స్ సెన్సార్ బోర్డు తీరును తీవ్రంగా దుయ్యబడుతున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు లిబరల్‌గా ఉండాల్సింది పోయి.. ఇంకా సంకుచితంగా వ్యవహరిస్తున్నారంటూ సెన్సార్ బోర్డు మీద మండిపడుతున్నారు.
ఇలాంటి టైంలో సినిమా మేకర్స్‌ను మరింత ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంది సెన్సార్ బోర్డు. ఇకపై సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక.. సినిమాను ముట్టుకోవడానికి వీల్లేదట. సన్నివేశాలను తొలగించడం, కొత్త సీన్లు జోడించడం లాంటివి కుదరవట. ఈ మేరకు సెన్సార్ బోర్డు రూల్ నంబర్ 33లో కీలక మార్పు చేసింది.
ఏదైనా కొత్త సినిమా రిలీజైనపుడు దాని రన్ టైం ఎక్కువ అని విమర్శలు వస్తే.. మేకర్స్ తమ సౌకర్యం మేరకు కొన్ని సీన్లు తీసేసి నిడివి తగ్గించడం మామూలే. ఇటీవల ‘పెద్ది’, ‘నాగబంధం’ లాంటి సినిమాలకు ఇలాగే చేశారు. అంతే కాక కొన్ని ఆకర్షణీయ సన్నివేశాలు, పాటలను రిలీజైన కొన్ని రోజులకు కలుపుతుంటారు. రాజాసాబ్, పెద్ది సినిమాల విషయంలో ఇది జరిగింది. కానీ ఇకపై అలా చేసే సౌలభ్యం మేకర్స్‌కు ఉండదట.
ఒకసారి సర్టిఫికెట్ జారీ అయిందంటే ఆ వెర్షన్‌ను ముట్టుకోవడానికి వీల్లేదట. ఆ మేరకు నిబంధనలు మార్చేసిందట సెన్సార్ బోర్డు. ఇది ఫిలిం ఇండస్ట్రీకి శరాఘాతం లాంటి నిర్ణయమని.. ఇది ఫిలిం మేకర్స్ స్వేచ్ఛను హరించడమేనన్న వాదన ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి అనేక ఇబ్బందులున్నాయని.. అవి చాలవని ఇది కూడానా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రేక్షకులు ఫీడ్ బ్యాక్‌ను అనుసరించి సన్నివేశాలను తీసేస్తే.. సెన్సార్ చేయించిన సన్నివేశాలను కలిపితే తప్పేముందని.. దీని వల్ల సెన్సార్ బోర్డుకొచ్చిన బాధేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
